
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ( సీతక్క) కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పర్యటనలో ఉన్న ఆమె.. మంగళవారం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో 6,176 గ్రామ పంచాయతీలకు భవనాలు లేవని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తాత్కాలిక భవనాల్లో పంచాయతీలు తమ విధులను సరిగా నిర్వర్తించలేకపోతున్నాయని వివరించారు. అందువల్ల రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ స్కీం ద్వారా పంచాయతీ భవనాల నిర్మాణం కోసం రూ.1,544 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌తో కూడా సీతక్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద తెలంగాణలోని 10 లక్షల గృహాలకు రక్షిత మంచి నీటిని అందించేందుకు నిధులు కేటాయించాలని కోరారు.