
- పీఆర్ గ్రామీణాభివృద్ధి బడ్జెట్‌పై రివ్యూ
- భగీరథ నీటి నాణ్యతపై గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచన
- గత ప్రభుత్వం రూ.30 వేల కోట్ల అప్పుచేసి తమ ప్రభుత్వంపై భారం మోపిందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మిషన్ భగీరథ పథకం పనితీరుపై ఈనెల 15 లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆ నివేదికను అందరు ఎమ్మెల్యేలకు అందజేసి ఇంటింటికి నీరు అందుతున్న విషయాన్ని నిర్ధారించుకోవాలన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఆదాయం సాధించి అప్పు చెల్లిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల అప్పు చేసిందని, ఆదాయం సాధించడం, అప్పు చెల్లించడంలో కార్పొరేషన్ పూర్తిగా విఫలమైందని డిప్యూటీ సీఎం అన్నారు.
కార్పొరేషన్ విఫలం కావడంతో ఆ అప్పులు తమ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శనివారం సెక్రటేరియెట్ లో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి బడ్జెట్ పై మంత్రి భట్టి.. పీఆర్ మంత్రి సీతక్కతో కలిసి రివ్యూ చేశారు. భట్టి మాట్లాడుతూ అసలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిని ఎంత శాతం మేరకు వినియోగిస్తున్నారో సర్వేలో చేర్చాలన్నారు. 60 శాతం మంది మాత్రమే మిషన్ భగీరథ నీరు వాడుకుంటున్నారని అధికారులు తెలిపారు.
రూ.30 వేల కోట్లు ఖర్చుచేసి పూర్తిస్థాయిలో ఈ పథకాన్ని వినియోగించుకోకపోతే అర్థం లేదని భట్టి చెప్పారు. మిషన్ భగీరథ నీటి నాణ్యత, ఆరోగ్యం తదితర అంశాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి చైతన్యం చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
వారంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు
గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయకుండా మొదట పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఉచితంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వారం రోజుల్లోనే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
నిపుణులతో ఉచితంగా గ్రామీణ యువతకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. నాలుగు నెలల్లోనే ఈ సెంటర్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని ఉపాధి కల్పన, మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎంత మందికి శిక్షణ ఇచ్చారు, శిక్షణ తీసుకున్న వారు ఏం చేస్తున్నారో వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఉపాధి హామీలో పూడికతీత పనులను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఆవాస గ్రామాలకూ మిషన్ భగీరథ చేరాలి
అన్ని ఆవాస గ్రామాలకు సురక్షిత మంచినీరు అందేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. రాష్ట్ర తాగునీటి సరఫరా కార్పొరేషన్ తో అన్ని ఆవాసాలను అనుసంధానం చేయాలని ఆమె సూచించారు. నల్లా ద్వారా రక్షిత మంచినీరు అందని గ్రామాలను గుర్తించి తక్షణం పనులు ప్రారంభించాలన్నారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సమావేశం శుక్రవారం సెక్రటేరియెట్ లో జరిగింది.
మిషన్ భగీరథ పథకంపై అధికారులు ఆడిట్ నివేదిక సమర్పించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో, అడవుల్లో నివసించే ప్రజలకు సైతం నల్లా నీరు అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అడవుల గుండా విద్యుత్ లైన్లపై కేంద్ర అటవీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున, ఆవాస గ్రామాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి బోర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సూచించారు.