మే నెలలో 3.5 కోట్ల పనిదినాలు టార్గెట్ : మంత్రి సీతక్క

మే నెలలో 3.5 కోట్ల పనిదినాలు టార్గెట్ : మంత్రి సీతక్క
  • ఉపాధి కూలీలకు తాగునీరు, నీడ ఏర్పాటు చేయాలి
  • అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

హైదరాబాద్ వెలుగు : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె ములుగు జిల్లా నుంచి స్పెషల్ సీఎస్ దాన కిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్ , 31 జిల్లాల డీఆర్డీఓలు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఉపాధి హామీ పథకం అమలులో మే మాసం అత్యంత కీలకమని.. ఈ నెలలో కనీసం మూడున్నర కోట్ల పనిదినాలను పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. రాష్ట్రంలో పంట కోతలు ముగియడంతో ఉపాధి పనులకు డిమాండ్ పెరిగిందని, పని కోరిన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలని ఆదేశించారు.

ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 20 రకాల పనులను అందుబాటులో ఉంచాలని, ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌‌ను నియమించాలని సూచించారు. ఏప్రిల్ మాసంలో కోటిన్నర పనిదినాలను పూర్తి చేసిన అధికారులను అభినందించారు. మే నెలలో లక్ష్య సాధన కోసం యజ్ఞంలా పనిచేయాలని పిలుపునిచ్చారు. తక్కువగా పనులు జరుగుతున్న మండలాలను స్వయంగా పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. 

ఎండల దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు

ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ఫస్ట్ ఎయిడ్ కిట్లు వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఎండ ప్రభావం తగలకుండా పనులను ఉదయం, సాయంత్రం వేళల్లోనే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సర్పంచ్‌‌లతో కలిసి గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి, పథకంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.