V6 News

ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినం

ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినం
  • సమయానికి రైతుభరోసా ఇస్తున్నం
  • బీఆర్​ఎస్​ ఎన్నడైనా టైముకు రైతుబంధు ఇచ్చిందా?
  • రాష్ట్ర పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి సీతక్క

మంగపేట, వెలుగు: రాష్ట్రంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మాజీ సీఎం కేసీఆర్ హేళనగా మాట్లాడుతున్నారని, ఈ పథకాన్ని ఎత్తివేసేందుకు బీఆర్​ఎస్​ కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో మంగళవారం ఆమె పర్యటించారు. మల్లూరులోని హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌‌‌‌‌‌‌‌తో కలిసి మల్లూరు, మంగపేట ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో లయన్స్ క్లబ్ సహకారంతో మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.

అనంతరం సీతక్క మాట్లాడుతూ.. మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్ల అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో రైతుబంధు నిధులు ఒకేసారి ఇవ్వలేదని, నెలల తరబడి ఆలస్యం చేసేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలంలో కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కల్యాణి, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, డీపీవో వెంకయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైల జయరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.