భద్రాద్రి రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

భద్రాద్రి రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో జగదబిరాముడి... లోకపావని సీతాదేవి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. రాములోరి కల్యాణ విశిష్టతతో పాటు, భద్రాద్రి ఆలయ చరిత్ర, వైభవాన్ని భక్తులకు వివరిస్తున్నారు వేద పండితులు. భద్రాచలం ఆలయం ఆరుబయట మిథిలా స్టేడియంలో కల్యాణ వేడుక జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, అధికారులు రాములోరి కల్యాణానికి హాజరయ్యారు. టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. జై శ్రీరామ్ నినాదాలతో మిథిలా స్టేడియంతో పాటు, భద్రాద్రి పుర వీధులు మార్మోగుతున్నాయి. ఈ సారి క్లీన్ భద్రాద్రి.... క్లీన్ శ్రీరామనవమి పేరుతో జిల్లా కలెక్టర్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. వాటర్ ప్యాకెట్ల ప్లేస్ లో బాటిళ్లను పంపిణీ చేస్తున్నారు. 

ఇవాళ సీతారాముల కల్యాణం, రేపు రామయ్య పట్టాభిషేకం వైభవంగా జరగనున్నాయి. కరోనా కారణం గత రెండేళ్ల కల్యాణానికి భక్తులను అనుమతించలేదు. ఇక కల్యాణానికి తరలివచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదాలు, తలంబ్రాలను  సిద్ధం చేశారు. తలంబ్రాలకు 50 కౌంటర్లు, లడ్డూలకు 30 కౌంటర్లు పెట్టారు. బ్రహ్మోత్సవాలకు దాదాపు 2కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేశారు.ఇక రాత్రి భద్రాచలం ఆలయంలో ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా జరిగింది. రాములోరి కళ్యాణం తిలకించేందుకు పెద్ద పెద్ద LED  స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎండాకాలం కావడంతో.. చలువ పందిళ్లు, షామియానాలు, కూలర్లను ఏర్పాటు చేశారు. మంచినీరు అందుబాటులో ఉంచారు.