న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సీడబ్ల్యూ)ని ఆశ్రయించారు. చిన్నయ్య తనను వేధింపులకు గురిచేశారంటూ కొన్ని నెలల క్రితం ఢిల్లీలో నిరసన, సూసైడ్ యత్నం చేసిన శేజల్ శుక్రవారం ఢిల్లీలో మరోసారి ఎన్ సీడబ్ల్యూ కి కంప్లైంట్ చేశారు. ఎన్ సీడబ్ల్యూ గతంలో చేసిన సూచనల మేరకు చిన్నయ్యపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ ఇవ్వమని అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. పోలీసులు తనపైనే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని ఫిర్యాదు చేశారు.
మూడు రోజులు ఒక గదిలో తనని బందించి, వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే అధికార బలం ఉపయోగించి పోలీసులతో తనను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని ఎన్ సీడబ్ల్యూ కి శేజల్ విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కొత్త పార్లమెంట్ భవనం సమీపంలో ఆమె చిన్నయ్యకు వ్యతిరేకంగా బ్యానర్ పట్టుకొని ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసే దాకా పోరాటం ఆపేది లేదని శేజల్ స్పష్టం చేశారు.

