- అర్ధరాత్రి వేళ ఐదు గంటల పాటు హైడ్రామా
- మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్
- పోలీసుల అదుపులో మద్దతుగా వచ్చిన వ్యక్తి
బషీర్ బాగ్, వెలుగు : తనను లైంగికంగా, మానసికంగా వేధించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బాధిత యువతి బోడపాటి శేజల్ హైదరాబాద్ లో ఆందోళనకు దిగింది. గురువారం అర్ధరాత్రి అబిడ్స్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంటున్న ఎమ్మెల్యేపై ఈ నెల 11న అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఫిర్యాదు చేసి మూడు రోజులు గడుస్తున్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం వల్లే ఆయనపై కేసు నమోదు చేయడం లేదని ఆరోపించింది.
తనకు రాష్ట్రంలో న్యాయం జరగదని ఆత్మహత్యాయత్నం చేసుకుంటే బతికించి మళ్లీ ఇబ్బందులు పెడుతున్నారని కన్నీరు పెట్టుకుంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేసేంత వరకు కదిలేది లేదంటూ అబిడ్స్ పోలీస్ స్టేషన్ ముందు భీష్మించుకు కూర్చుంది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. సుమారు ఐదు గంటల తర్వాత మహిళా పోలీసులు ఆమెను అక్కడి నుండి మహిళా పీఎస్‌కు తరలించారు. శుక్రవారం కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. బాధిత యువతికి మద్దతుగా వచ్చిన ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై గతంలో పలు కేసులు నమోదైనట్లు అబిడ్స్ సీఐ ప్రసాద్ రావు తెలిపారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ కేసుకు సంబంధించి వారెంట్ ఉండడంతో అతడిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.
