నాగ్‌పూర్: ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు, గొడవలకు స్వార్థ ప్రయోజనాలు, ఆధిపత్య ధోరణే ప్రధాన కారణమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. క్రమశిక్షణ, ఐక్యత, ధర్మాన్ని పాటించడం ద్వారానే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
శుక్రవారం మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) విదర్భ ప్రాంత కార్యాలయానికి భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గత 2,000 ఏండ్లుగా ఘర్షణలను పరిష్కరించడానికి ప్రపంచం వివిధ ఆలోచనలతో ప్రయోగాలు చేసిందని, కానీ పెద్దగా విజయం సాధించలేదన్నారు.
మతపరమైన అసహనం, బలవంతపు మతమార్పిడులు, ప్రజల్లో బేధాభావాలు ఇప్పటికీ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఒక్కటే అనే భావనను భారతదేశ ప్రాచీన జ్ఞానం బోధిస్తోందని చెప్పారు. సంఘర్షణ నుంచి సామరస్యం, సహకారానికి మారాలని ఆయన పిలుపునిచ్చారు.
