వాషింగ్టన్: అమెరికా షట్ డౌన్ త్వరలో ముగియనుంది. నిధుల బిల్లుకు సోమవారం సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించగా సెనేట్ ఆమోదముద్ర వేసింది. బిల్లుకు 60 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా.. 40 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లుకు మద్దతు తెలిపిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అది సెనేట్ ఆమోదం పొందింది. ప్రతిపక్ష డెమోక్రాట్ సభ్యుల్లో 8 మంది బిల్లుకు అనుకూలంగా ఓటువేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. అతి త్వరలోనే ప్రభుత్వ కార్యకలాపాలను రీఓపెన్ చేస్తామన్నారు.
కాగా.. షట్ డౌన్‌తో దేశవ్యాప్తంగా 41 రోజుల పాటు కార్యకలాపాలు స్తంభించాయి. గత నెల 1న షట్ డౌన్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో కొన్ని లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు అందలేదు. సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. ఏవియేషన్ సహా పలు కీలక రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ఈ నేపథ్యంలో షట్ డౌన్ ముగింపు పలికేందుకు నిధుల బిల్లుపై మరోమారు సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించారు. సభ్యులు వాషింగ్టన్కు వచ్చి ఓటింగ్‌లో పాల్గొనాలని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ తర్వాత ఆయన మాట్లాడుతూ షట్ డౌన్ త్వరలో ముగియనుందని చెప్పారు.
కొన్ని వారాల సంప్రదింపుల తర్వాత ఒప్పందం
షట్ డౌన్ ప్రతిష్టంభనను తొలగించడానికి డెమోక్రాటిక్ మాజీ సెనేటర్ల జీన్ షహీన్, మేగీ హసన్, ఇండిపెండెంట్ సెనేట్ ఆంగస్ కింగ్పలు దఫాలుగా సెనేట్ మెజారిటీ లీడర్ జాన్ తునేతో భేటీ అయ్యారు. షట్ డౌన్ ముగింపుకు ఉన్న అడ్డంకులపై చర్చించారు. జనవరి వరకు ప్రభుత్వ ఫండింగ్‌కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు త్రీ బైపార్టీషన్ యాన్యువల్ స్పెండింగ్ బిల్లులకు మాజీ గవర్నర్లు ఓటువేశారు.
బిల్లు ఆమోదం పొందడానికి కనీసం 60 ఓట్లు అవసరం. అయితే.. సెనేట్‌లో 53 మంది రిపబ్లికన్లు, 47 మంది డెమోక్రాట్లు ఉన్నారు. దీంతో బిల్లుకు అనుకూలంగా ఓటువేసేలా ప్రతిపక్ష డెమోక్రాట్లలో 8 మందిని ఒప్పించారు. ఆ 8 మంది డెమోక్రాట్లు అనుకూలంగా ఓటు వేయడంతో నిధుల బిల్లుకు మెజారిటీ లభించి ఆమోదముద్ర పడింది.
సెనేట్‌లో మరోసారి బిల్లుపై ఓటింగ్
నిధుల బిల్లుకు ప్రస్తుతం సెనేట్ ఆమోదం లభించినా అది తాత్కాలికమే. మరోసారి ఈ బిల్లుపై సెనేట్ లో ఓటింగ్ నిర్వహించనున్నారు. అప్పుడు కూడా బిల్లుకు సెనేట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తర్వాత దానిని ప్రతినిధుల సభ ఆమోదం కోసం పంపుతారు.
ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేస్తే అధ్యక్షుడి వద్దకు బిల్లు చేరుతుంది. బిల్లుపై ఆయన సంతకం పెట్టిన తర్వాతే అది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది. ఈ ప్రక్రియ జరగడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
