అంబాలా (హర్యానా): బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని హర్యానా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్నేత ప్రియాంక గాంధీ వాద్రా పిలుపు నిచ్చారు. ఆ పార్టీ కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. ప్రజలకు చేసిందేమీలేదని ఆమె మండిపడ్డారు. సోమవారం హర్యానాలోని అంబాలాలో నారైన్‌గరాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ‘‘రైతులు, క్రీడాకారులు, సైనికులు దేశ గౌరవాన్ని నిలబెట్టారు. కానీ, గత పదేండ్లలో బీజేపీ మాత్రం వారిని ఎప్పుడూ అవమానిస్తూనే ఉంది. రైతులపై లాఠీచార్జ్ చేసి దారుణంగా ప్రవర్తించింది.
కష్టపడి పనిచేసే హర్యానా పిల్లలకు ఉపాధి లభించలేదు. అసలు హర్యానా ప్రజల కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలి’’ అని ప్రియాంక డిమాండ్ చేశారు. ‘‘మా రెజ్లర్లను ఏం చేశారు. వాళ్లను రోడ్డుపై కూర్చోబెట్టారు. వారిని కలవడానికి ప్రధాని మోదీకి ఐదు నిమిషాలు కూడా సమయం దొరకలేదు. అలాగే, ఇటీవల ఒలింపిక్స్‌లో ఏం జరిగిందో మీరంతా చూశారు. పోరాడే ప్రజలారా, మీకు ఆత్మగౌరవం ఉంది. మీరు ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇక్కడి ప్రభుత్వం మీ కోసం ఏమీ చేయడం లేదు. మీరు ఆత్మగౌరవంతో బతకాలంటే, న్యాయం కావాలంటే ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టండి’’ అని ప్రియాంక పిలుపునిచ్చారు.
అంతేకాకుండా, ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల హర్యానాలో నిరుద్యోగం ఏర్పడిందని ఆమె ఆరోపించారు. “హర్యానాలో నిరుద్యోగం పెరిగిపోయింది. పేపర్లు లీక్ అయ్యాయి, ప్రభుత్వాసుపత్రుల్లో సీట్లు ఖాళీ అయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం వల్ల మీ భవిష్యత్తు అంధకారంలో పోతుందని మీరు భావిస్తున్నారు. అయితే, హర్యానాలో బీజేపీ పోయి, కాంగ్రెస్ రావాల్సిన సమయం వచ్చింది.. ఈ మార్పు రావాలంటే మీరు కాంగ్రెస్కు ఓటు వేయాలి’’ అని ప్రియాంక గాంధీ సూచించారు. ఈ నెల 5 హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అంబాలాతో పాటు కురుక్షేత్రలో కాంగ్రెస్పార్టీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు ప్రియాంక గాంధీతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం అంబాలా చేరుకున్నారు.