
రాజకీయాల్లో లీకులు కామనే. చాలా మంది ఈ లీకులతోనే మంచి చాన్సులు కొట్టేస్తరు. కానీ ఒక్కోసారి అవి రివర్స్ కూడా అవుతాయి. రేవంత్ రెడ్డి విషయంలో అదే జరిగిందని ఆ పార్టీ వాళ్లు మాట్లాడుకుంటున్నరు. రేవంతే పీసీసీ చీఫ్ అని కొన్ని మీడియాలకు ఆయన అనుచరులు లీకిచ్చారట. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్ అయ్యింది. అవి చూసి సీనియర్ లీడర్లు అగ్గి మీద గుగ్గిలం అయ్యిన్రు. నిన్న మొన్న వచ్చినోడు కూడా పీసీసీ ప్రెసిడెంటా అని గుస్సా అయి.. విమానం ఎక్కి ఢిల్లీ పోయిన్రు. పెద్ద లీడర్లను కలిసి ‘మీరు ఎవళ్లనన్నా పీసీసీ చెయ్యిన్రి. రేవంత్‌ను చేస్తే మాత్రం ఊరుకోం’ అని మొహం మీదనే చెప్పిన్రట. దాంతో పెద్దలు ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుకొని ‘ఇప్పుడేం చెయ్యం పోండ్రి’ అని భరోసా ఇచ్చిండ్రట. లీక్ ఇచ్చి ఖుద్దు చెడకొట్టుకున్నడని, డిసెంబర్ దాకా హైకమాండ్ ఈ విషయం ఆలోచించదని ఒక కాంగ్రెస్ లీడర్ అంటున్నడు. లీకులు ఇట్లా రివర్స్ కొడ్తయని రేవంత్ ఊహించుకొని ఉండడని అంటున్నరు.