
- ఈ నెలాఖరులో ప్రస్తుత డీజీపీ రిటైర్‌మెంట్
- ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డికే చాన్స్
- హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు విజిలెన్స్, ఏసీబీ చీఫ్‌గా అవకాశం!
హైదరాబాద్, వెలుగు: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో దసరాకు కొత్త బాస్రానున్నారు. ఈ నెలాఖరున ప్రస్తుత డీజీపీ జితేందర్ రిటైర్డ్ కానుండగా, కొత్త డీజీపీ ఎవరనే దానిపై చర్చ మొదలైంది. రేసులో సీనియర్ ఐపీఎస్‌లు సీవీ ఆనంద్, శివధర్ రెడ్డి ఉన్నట్టు పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. వీళ్లిద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడం, ఇద్దరూ సీనియర్లు కావడంతో ఎవరికీ డీజీపీ పోస్టు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. సర్వీస్ పరంగా శివధర్‌రెడ్డి (1994 బ్యాచ్)తో పోలిస్తే సీవీ ఆనంద్(1991 బ్యాచ్)నే సీనియర్. అయితే శివధర్ రెడ్డి మరో ఏడు నెలల్లో రిటైర్కాబోతుండడం, ఆ తర్వాత సీవీ ఆనంద్‌కు డీజీపీగా అవకాశం ఉండడంతో... ప్రస్తుతం శివధర్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే డీజీపీగా శివధర్‌రెడ్డి పేరు ఖరారైనట్టు డిపార్ట్‌మెంట్‌లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేస్తున్నారు.
సిటీ సీపీ రేసులో సజ్జనార్..
దసరాకు రెండు, మూడు రోజుల ముందే భారీగా ఐపీఎస్‌ల బదిలీలు కూడా జరగనున్నాయి. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బదిలీ అయితే, ఆయన స్థానంలోకి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. సిటీ పోలీస్ బాస్ పోస్ట్ కోసం ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్(1996 బ్యాచ్), అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్(1995), సీఐడీ చీఫ్ చారుసిన్హా(1996)తో పాటు 1997 బ్యాచ్ ఐపీఎస్‌లు వై.నాగిరెడ్డి, డీఎస్ చౌహాన్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుత సిటీ అడిషనల్ సీపీ( లా అండ్ ఆర్డర్) విక్రమ్‌సింగ్ మాన్ (1998 బ్యాచ్) పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే వీవీ శ్రీనివాస్, స్వాతిలక్రా, సంజయ్‌కుమార్ జైన్, స్టీఫెన్ రవీంద్ర సైతం హైదరాబాద్ సీపీ పోస్టుకు అర్హులుగా ఉన్నారు. సజ్జనార్ పేరు హైదరాబాద్ సీపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీ పోస్టుకు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు సైబరాబాద్ సీపీగా ప్రస్తుత ఎస్‌ఐబీ చీఫ్ బి.సుమతి, ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా డీజీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు పెద్ద సంఖ్యలో ఐపీఎస్‌ల బదిలీలు ఉంటాయని, అవి దసరాలోపే జరుగుతాయని తెలిసింది.
సీవీ ఆనంద్ నేతృత్వంలో కీలక కేసుల దర్యాప్తు..
ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్న సీవీ ఆనంద్‌కు ప్రభుత్వం విజిలెన్స్ డీజీతో పాటు ఏసీబీ చీఫ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అక్రమాలకు సంబంధించిన కీలక కేసులను సీవీ ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు చేయించాలనే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పాత్ర కీలకం కానుంది. ఇందుకు సీవీ ఆనంద్ సమర్థవంతమైన అధికారిగా ప్రభుత్వం భావిస్తున్నది. సీవీ ఆనంద్‌తో పాటు రవిగుప్తా (1990 బ్యాచ్), సౌమ్యామిశ్రా (1994), శిఖాగోయల్(1994), అభిలాష్ బిస్త్(1994), ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994) కూడా ప్రస్తుతం డీజీ ర్యాంకులో కొనసాగుతున్నారు. వీరిలో రవిగుప్తా ఈ ఏడాది డిసెంబర్ 19న రిటైర్డ్ కానున్నారు. ఆప్టే వినాయక్ ప్రభాకర్ కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు. శిఖాగోయల్ మహిళా డీజీపీ రేసులో ఉన్నట్టుగా చర్చ జరుగుతున్నది.