- 23 రన్స్ తేడాతో జింబాబ్వే సంచలన విజయం
- రాణించిన బెనెట్, మరుమణి, బాల్‌తో ముజరబానీ మ్యాజిక్
- 170 టార్గెట్ ఛేజింగ్‌లో 146కే ఆస్ట్రేలియా ఢమాల్
కొలంబో: టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే పెను సంచలనం సృష్టించింది. అద్భుత ఆటతో అత్యంత బలమైన ఆస్ట్రేలియాకు షాకిచ్చి ఔరా అనిపించింది. బ్యాటింగ్‌లో బ్రియాన్ బెనెట్ (56 బాల్స్‌లో 7 ఫోర్లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీకి తోడు బౌలింగ్‌లో పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ (4/17), బ్రాడ్ ఇవాన్స్ (3/23) రాణించడంతో.. శుక్రవారం జరిగిన గ్రూప్–బి లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే 23 రన్స్ తేడాతో ఆసీస్‌పై గెలిచింది. షార్ట్ ఫార్మాట్‌లో కంగారూలపై గెలవడం జింబాబ్వేకు ఇది రెండోసారి మాత్రమే. 2007 టీ20 వరల్డ్ కప్‌లోనూ ఓ సారి ఆసీస్‌ను ఓడించింది. టాస్ ఓడిన జింబాబ్వే 20 ఓవర్లలో 169/2 స్కోరు చేసింది. తర్వాత ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 146 రన్స్‌కే ఆలౌటైంది. మ్యాట్ రెన్‌షా (44 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 65) మినహా మిగతా వారు నిరాశపర్చారు. ముజరబానీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
‘టాప్’ లేపారు..
మ్యాచ్ ఆరంభం నుంచే జింబాబ్వే టాపార్డర్.. ఆసీస్ బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంది. కమిన్స్, హేజిల్‌వుడ్ లేకపోవడంతో కంగారూల పేస్ బలహీనంగా మారడం కూడా జింబాబ్వేకు కలిసొచ్చింది. ఓపెనర్ బెనెట్ ఏడు ఫోర్లు బాదితే, మరుమణి (21 బాల్స్‌లో 7 ఫోర్లతో 35) కూడా బ్యాట్‌ఝుళిపించాడు. డ్వారిషస్ వేసిన మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు, మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో మూడు ఫోర్లతో మరుమణి టచ్‌లోకి వచ్చాడు. దాంతో పవర్‌ప్లేలో 47/0 స్కోరు వచ్చింది. 8వ ఓవర్‌లో మరుమణిని ఔట్ చేసిన స్టోయినిస్ (1/17) క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని విడగొట్టాడు. దాంతో తొలి వికెట్‌కు 61 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఫస్ట్ టెన్‌లో 79/1 స్కోరు చేసిన జింబాబ్వే ఇన్నింగ్స్‌ను రైన్ బర్ల్ (30 బాల్స్‌లో 4 ఫోర్లతో 35) దీటుగా ముందుకు తీసుకెళ్లాడు. స్పిన్నర్ జంపాను బెనెట్, బర్ల్ ఎదుర్కొన్న తీరు సూపర్బ్. ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టారు. ఫలితంగా 11 నుంచి 15వ ఓవర్ వరకు 46 రన్స్ రాబట్టారు. దాంతో 125/1 స్కోరుతో నిలిచింది. 16వ ఓవర్‌లో బర్ల్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో స్టోయినిస్ చేతికి గాయమైంది. నొప్పితో అతను గ్రౌండ్‌ను విడిచిపెట్టాడు. కానీ ఇదే ఓవర్ లాస్ట్ బాల్‌కు గ్రీన్ (1/6).. బర్ల్‌ను పెవిలియన్‌కు పంపడంతో రెండో వికెట్‌కు 70 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. 43 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన బెనెట్‌కు చివర్లో సికందర్ రజా (13 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 25 నాటౌట్) అండగా నిలిచాడు. భారీ షాట్లతో చెలరేగి మూడో వికెట్‌కు 24 బాల్స్‌లోనే 38 రన్స్ జత చేశాడు.
బౌలర్లు సూపర్..
ఛేజింగ్‌లో ఆసీస్ స్టార్లను కట్టడి చేయడంలో జింబాబ్వే బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఆరంభంలో పేసర్లు ముజరబానీ, ఇవాన్స్ మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు స్వింగ్‌ను కూడా రాబట్టారు. దాంతో వరుస విరామాల్లో జోస్ ఇంగ్లిస్ (8), కామెరాన్ గ్రీన్ (0), టిమ్ డేవిడ్ (0), ట్రావిస్ హెడ్ (17) ఔట్ కావడంతో ఆసీస్ 29/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో మ్యాక్స్‌వెల్, రెన్‌షా జింబాబ్వే బౌలింగ్‌పై ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో ఐదో వికెట్‌కు 77 రన్స్ జోడించి గెలుపుపై ఆశలు కల్పించారు. కానీ 15వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేసిన రైన్ (1/9) పరిస్థితిని తలకిందులు చేశాడు. ఆ వెంటనే మసకద్జా (1/36).. స్టోయినిస్ (6)ను దెబ్బకొట్టాడు. ఆరు బాల్స్ తర్వాత ఇవాన్స్.. డ్వారిషస్ (6)ను పెవిలియన్‌కు పంపాడు. ఎలీస్ (7 నాటౌట్) నిలబడ్డా.. 19వ ఓవర్‌లో ముజరబానీ మూడు బాల్స్ తేడాలో రెన్‌షా, జంపా (2) వికెట్లు తీశాడు. చివర్లో కునెమన్ (0) రనౌటయ్యాడు. ఓవరాల్‌గా 40 రన్స్ తేడాలో 6 వికెట్లు పడటంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే: 20 ఓవర్లలో 169/2 (బెనెట్ 64 నాటౌట్, మరుమణి 35, గ్రీన్ 1/6).
ఆస్ట్రేలియా: 19.3 ఓవర్లలో 146 ఆలౌట్ (రెన్‌షా 65, మ్యాక్స్‌వెల్ 31, ముజరబానీ 4/17, ఇవాన్స్ 3/23).
