24 గంటలు కాక ముందే మళ్లీ దిగాలు.. నిన్నటి నిన్న 16 లక్షల కోట్ల సంపద సంపాదించిన మన స్టాక్ మార్కెట్.. 2026, ఏప్రిల్ 9వ తేదీ మళ్లీ ఢమాల్ అన్నది. 24 గంటల్లోనే ఆనందం ఆవిరి అయ్యింది. ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. అక్కడెక్కడో యుద్ధం..కాల్పులు అనగానే మన స్టాక్ మార్కెట్ కుయ్యోమొర్రో అంటోంది. ఐటీ, ఆయిల్, పెట్రో కెమికల్స్.. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కంపెనీల స్టాక్స్ పడ్డాయి అంటే ఓకే.. అలా కాకుండా అక్కడ ట్రంప్ వార్నింగ్ ఇస్తే.. మన స్టాక్ మార్కెట్ లోని అన్నీ షేర్లు పడిపోవటంతో ఇన్వెస్టర్లు అందరూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం నాటి భారీ లాభాల తర్వాత భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవడం, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 402పాయింట్లు తగ్గి 77వేల160 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 103 పాయింట్లు 23వేల893దగ్గర ట్రేడ్ అవుతోంది.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు
పశ్చిమాసియాలో ముదిరిన సంక్షోభం.. బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులు మార్కెట్లను వణికించాయి. కేవలం 10 నిమిషాల్లో 100 చోట్ల బాంబుల వర్షం కురిపించడంతో కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. వాషింగ్టన్‌తో చర్చలు జరపడం సాధ్యం కాదని అని ఇరాన్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగారు.
కాల్పుల విరమణపై నీలినీడలు.. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల గడువు కేవలం తాత్కాలికమేనని, శాశ్వత శాంతి దిశగా అడుగులు పడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. శనివారం జరగబోయే చర్చలకు ముందు అటు అమెరికా, ఇటు టెహ్రాన్ నుంచి వస్తున్న హెచ్చరికలు స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.
లాభాల స్వీకరణ ..నిన్నటి సెషన్‌లో సెన్సెక్స్ దాదాపు 3వేల పాయింట్లు లాభపడటంతో, ఈ రోజు ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు తోడవడం మార్కెట్ పతనానికి దారి తీసింది.
