500 పాయింట్లు కోలుకున్న సెన్సెక్స్

 500 పాయింట్లు కోలుకున్న సెన్సెక్స్

మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..   మళ్లీ  లాభాల బాట పట్టాయి.  ఐటీ, మెటల్ కంపెనీల షేర్లలో రికవరీ చోటుచేసుకోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఒకానొక దశలో 52,515 పాయింట్లకు పడిపోయిన సెన్సెక్స్.. మళ్లీ కోలుకొని 500 పాయింట్లకుపైగా పెరిగి 53,068కి చేరింది.  ప్రారంభంలో 15,668 పాయింట్లకు పడిపోయిన నిఫ్టీ..  180 పాయింట్లు పెరిగి 15,846 కు ఎగిసింది.  బీఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు కూడా సగటున 0.7 శాతం మేర పెరిగాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ధర 4 శాతం మేర పెరిగి రూ.2,157కు చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఎకో సిస్టమ్ ను నెలకొల్పే లక్ష్యంతో  ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఎనర్జీస్ కంపెనీతో అదానీ ఎంటర్ ప్రైజెస్ చేతులు కలిపిందనే వార్తలతో ఆ షేరులో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో ఆ షేరు ధర అమాంతం పెరిగింది.  వ్యవసాయ సీజన్ నేపథ్యంలో ఎరువుల కంపెనీల షేర్లు కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇందుకు భిన్నంగా నిఫ్టీలో .. రియాల్టీ, ఫైనాన్షియల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు దాదాపు 1 శాతం మేర నష్టపోయాయి.  

టాప్ గెయినర్స్ :  అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, ఐచర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్,  భారతీ ఎయిర్ టెల్, అల్ట్రా టెక్ సిమెంట్, గ్రాసిమ్ 

టాప్ లూజర్స్ :  టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్