హైదరాబాద్, వెలుగు : గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం మరో అడుగు వేసింది. సంప్రదాయేతర ఉపాధి రంగాల్లో మహిళలకు ఆదాయ వనరులను పెంచేందుకు సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ), పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు పశుసంవర్థక రంగంలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు.
పాల ఉత్పత్తి, గొర్రెలు, మేకల పెంపకం, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ (పెరటి కోళ్ల పెంపకం) వంటి రంగాల్లో మహిళలకు శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం శిక్షణే కాకుండా.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని సెర్ప్ నిర్ణయించింది. పశువుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు వెటర్నరీ యూనివర్సిటీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ‘మినరల్ మిశ్రమాన్ని’ రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
అలాగే, ఎక్కువ మాంసం, గుడ్ల ఉత్పత్తిని ఇచ్చే ప్రత్యేక కోడి జాతి పిల్లలను మహిళలకు పంపిణీ చేయనున్నారు. కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (సీఐఎఫ్) ద్వారా పొట్టేళ్ల యూనిట్లు, నర్సరీల ఏర్పాటుకు సహకారం అందించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామీణ మహిళలు కేవలం సంప్రదాయ పనులకే పరిమితం కాకుండా, ఆధునిక పద్ధతుల్లో ఆదాయం పెంచుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఈ భాగస్వామ్యం వల్ల మహిళలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ మీద అవగాహన పెరుగుతుందని, తద్వారా గ్రామీణ కుటుంబాల పోషక భద్రత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
