
- అధికారుల నానాతంటాలు
- కేంద్ర పథకాలకు 11 అంకెల యూనిక్ ఐడీ తప్పనిసరి
- ఉమ్మడి జిల్లాలో 50 శాతం కూడా దాటని ప్రక్రియ
జనగామ, వెలుగు: ఫార్మర్ రిజిస్ట్ర్రీకి సర్వర్ ప్రాబ్లమ్స్ఎక్కువయ్యాయి. ఆధార్ సంఖ్య మాదిరిగా ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన యూనిక్ ఐడీ నంబర్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన, సాయిల్హెల్త్కార్డులు తదితర కేంద్ర పథకాలకు దీన్ని తప్పనిసరి చేసింది. అయితే రైతుల భూముల వివరాలు డిజిటలైజ్ చేసే ప్రక్రియకు ఓటీపీలు సమస్యగా మారాయి. ఫోన్లకు ఓటీపీలు సరిగా రాకపోవడంతో రిజిస్ట్రేషన్ స్లోగా జరుగుతోంది.
మూడో ఓటీపీకే ఆలస్యం..
ఫార్మర్ రిజిస్ట్ర్రీకోసం వ్యవసాయ శాఖ అధికారులు నానాతంటాలు పడుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అగ్రిస్టాక్ రిజిస్ట్రీయాప్లో రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ యాప్ వినియోగానికి ఏఈవోలకు లాగిన్, యూజర్ ఐడీలను కేటాయించారు. వీరు ప్రతీ గ్రామంలో రైతు శిబిరాలు ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ప్రతీ రైతు పట్టాదారు పాసుబుక్, ఆధార్, ఫోన్ నంబర్‌ను యాప్‌లో ఎంట్రీ చేస్తుండగా ఓటీపీ సమస్య ఇబ్బందికరంగా మారింది. మూడుసార్లు ఓటీపీ రావాల్సి ఉండగా రెండు చకచకా వచ్చేస్తున్నాయి. మూడో ఓటీపీకి చాలా సమయం పడుతోంది. దీంతో లాగిన్ ప్రక్రియ మళ్లీ మొదటికి వస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు రెండు గ్రామాల్లో భూములున్నా, మున్సిపల్‌పరిధిలో ఉన్నా రిజిస్ట్రేషన్‌కు ఇబ్బంది కలిగింది. కానీ యాప్‌లో ఆ సమస్యకు పరిష్కారం లభించింది.
ఐడీలు స్లో..
రైతుల వివరాలు సరిగా లేక సకాలంలో సాయం అందడం లేదని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీంతో వారి వివరాల సేకరణకు చర్యలు తీసుకుంది. యూనిక్‌ఐడీ కార్డులో రైతు పేరు, గ్రామం, భూమి వివరాలు, బ్యాంకు రుణ అర్హత, కేంద్ర సబ్సిడీలు, కిసాన్ సమ్మాన్ నిధి తదితర వివరాలు ఉంటాయి. జనగామ జిల్లాలో 1,96,300 మంది రైతులకు పట్టాదారు పాసు బుక్‌లు ఉన్నాయి. వీరిలో ఇప్పటివరకు 68,707 మంది(34 శాతం) రిజిస్ట్రేషన్పూర్తయింది. ఈ ప్రక్రియలో జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో ఉంది. సంబంధిత కార్డులు త్వరలో జారీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌జిల్లాలోని మిగతా జిల్లాల్లో రిజిస్ట్రేషన్ 30 శాతం దాటలేదు.
ఉమ్మడి జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ తీరు
జిల్లా రైతులు రిజిస్ట్రేషన్పూర్తి
జనగామ 1,96,300 68,707 (34 శాతం)
మహబూబాబాద్ 1,93,033 56,222 (29.13 శాతం)
భూపాలపల్లి 1,19,485 33,259 (27.84 శాతం)
హనుమకొండ 1,57,01 38,984 (24.83 శాతం)
వరంగల్ 1,58,974 31,116 (19.57 శాతం)
ములుగు 74,324 20,122 (27.07 శాతం)