స్కూళ్లలో AI వాడకానికి జైకొడుతున్న టీనేజర్లు..అయితే రూల్స్ తప్పనిసరి అంటున్న స్టూడెంట్స్

స్కూళ్లలో AI వాడకానికి జైకొడుతున్న టీనేజర్లు..అయితే రూల్స్ తప్పనిసరి అంటున్న స్టూడెంట్స్

దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI)ను భాగం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ కీలక చర్యలు చేపడుతోంది. CBSE, NCERT ద్వారా 9వ తరగతి నుంచే పాఠ్యాంశాల్లో AIను ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. విద్యార్థులు AIను చదువులో ఉపయోగపడే సాధనంగా భావిస్తున్నప్పటికీ.. దాని వినియోగానికి స్పష్టమైన రూల్స్ , అందరికీ సమాన అవకాశాలు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలని కోరుకుంటున్నట్లు తేలింది. అదే సమయంలో AI ఇచ్చే సమాచారంలో కచ్చితత్వం, ఒరిజినాలిటీ, దానిపై అతిగా ఆధారపడటంపై విద్యార్థుల్లో ఆందోళనలు ఉన్నట్లు సర్వే వెల్లడించింది.

చైల్డ్ రైట్స్ అండ్ యూ (CRY) నిర్వహించిన ఈ సర్వేలో ఎక్కువమంది విద్యార్థులు ChatGPT వినియోగిస్తు్న్నట్లు తేలింది. 5వేల257 మంది టీనేజర్లపై నిర్వహించిన ఈ సర్వేలో5వేలమంది విద్యార్థులు తాము ChatGPTను ఉపయోగించినట్లు తెలిపారు. కేవలం 4.1 శాతం మంది మాత్రమే జనరేటివ్ AI గురించి తమకు తెలియదని చెప్పారు.

AI వినియోగం విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడుతుందనే  విషయంపై ఈ సర్వేలో ఓ క్లారిటీ వచ్చింది.  53 శాతం మంది విద్యార్థులు AI వల్ల తమ చదువులో స్వల్పంగా మెరుగుదల కనిపించిందని చెప్పారు. మరో 26 శాతం మంది తమ స్టడీలో గణనీయమైన మెరుగుదల వచ్చిందని చెప్పారు. అయితే 20 శాతం మంది మాత్రం AI వల్ల పెద్దగా మార్పు లేదని, ప్రతికూల ప్రభావం ఉందని చెప్పడం గమనార్హం. 

దీంతోపాటు AI వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు విద్యార్థులు.  AI ద్వారా వచ్చే సమాధానాలపై పూర్తిస్థాయిలో నమ్మకం లేదని 58 శాతం మంది విద్యార్థులు చెప్పగా.. AI సమాచారంలో తప్పులు, ఒరిజినాలిటీ లేకపోవడం వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయని,  AI కారణంగా ఉద్యోగాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని 57 శాతం మంది అభిప్రాయపడ్డారు.

AI సాధనాల అందుబాటుపై కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు.  విద్యార్థులందరికీ సమానంగా AI సాధనాలు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులకు మాత్రమే AI వినియోగాన్ని పరిమితం చేయడం అన్యాయానికి దారితీస్తుందని  అభిప్రాయం వ్యక్తం చేశారు. 

స్కూళ్లలో AIపై డిఫరెంట్స్ రూల్స్.. 

హోంవర్క్, ప్రాజెక్టుల్లో AI వినియోగంపై పాఠశాలల విధానాలు కూడా భిన్నంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కొన్ని పాఠశాలల్లో AI వినియోగంపై నిబంధనలు ఉన్నాయని 49.4 శాతం మంది విద్యార్థులు తెలిపారు. అయితే 50.6 శాతం మంది తమ పాఠశాలల్లో ఎలాంటి స్పష్టమైన నిబంధనలు లేవని చెప్పారు.

స్కూళ్లలో AI  వినియోగంపై స్పష్టమైన రూల్స్ రూపొందించాకే శిక్షణ మొదలు పెట్టాలని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.  అదేవిధంగా పాఠ్యాంశాల్లో AI ద్వారా రూపొందించిన కంటెంట్‌ను ఉపయోగించే ముందు ఉపాధ్యాయులు దాన్ని పరిశీలించాలని ఎక్కువ మంది విద్యార్థులు కోరుకున్నారు.