హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి పునాది సేవాదళ్ కార్యకర్తలేనని కాంగ్రెస్సీనియర్ నేత మధు యాష్కీ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న పీసీసీ సేవాదళ్ మూడు రోజుల శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా సేవాదళ్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 140 ఏళ్లుగా కాంగ్రెస్పార్టీకి సేవాదళ్ వెన్నుదన్నుగా నిలుస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తుందని చెప్పారు.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలోనూ సేవాదళ్ చేసిన కృషి మరువలేనిదని గుర్తుచేశారు. నిస్వార్థంగా పని చేసే కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటి వారని ప్రశంసించారు. కష్టపడి పనిచేసే సేవాదళ్ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీ పరంగా కూడా వీరికి సముచిత స్థానం కల్పించాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మధు యాష్కీ పేర్కొన్నారు.
