- ఎంఎస్ఎంఈలకు తక్కువ వడ్డీకే అప్పులు
- సర్టిఫికేషన్ అవసరాల కోసం ట్రేస్ పథకం
- ఏడు నిర్ణయాలను ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్రం శుక్రవారం ఏడు కీలక చర్యలు ప్రకటించింది. రూ. 25,060 కోట్లతో చేపట్టిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌లో భాగంగా ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. ఈ మిషన్‌లోని పది అంశాల్లో మూడు ఇప్పటికే జనవరిలో ప్రారంభమయ్యాయి.
ఈ-కామర్స్ ఎగుమతిదారులకు ‘డైరెక్ట్ ఈ-కామర్స్ క్రెడిట్’ ఫెసిలిటీ కింద రూ. 50 లక్షల వరకు లోన్లు ఇస్తారు. దీనికి 90 శాతం గ్యారంటీ కవరేజ్ ఉంటుంది. ‘ఓవర్సీస్ ఇన్వెంటరీ క్రెడిట్’ ఫెసిలిటీ ద్వారా రూ. ఐదు కోట్ల వరకు సాయం అందుతుంది. లోన్‌కు 75 శాతం గ్యారంటీతో పాటు 2.75 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. గరిష్టంగా ఏడాదికి రూ. 15 లక్షలు పొందొచ్చు. ఎంఎస్ఎంఈలకు తక్కువ వడ్డీకే వర్కింగ్ క్యాపిటల్ అందించేందుకు ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. దీని కింద 2.75 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. ఏడాదికి రూ. 50 లక్షల వరకు సాయం అందుతుంది.
టెస్టింగ్కూ మద్దతు
అంతర్జాతీయ టెస్టింగ్, సర్టిఫికేషన్ అవసరాల కోసం ట్రేడ్ రెగ్యులేషన్స్, అక్రిడిటేషన్ , కాంప్లయన్స్ ఎనేబ్లమెంట్ (ట్రేస్) పథకం ద్వారా ఎగుమతిదారులకు మద్దతు ఇస్తారు. పాజిటివ్ లిస్ట్ కింద 60 శాతం, ప్రయారిటీ పాజిటివ్ లిస్ట్ కింద 75 శాతం ఖర్చులను తిరిగి చెల్లిస్తారు.
ఒక్కో ఐఈసీ కోడ్‌కు ఏడాదికి రూ. 25 లక్షల వరకు పరిమితి ఉంటుంది. ఫ్లో పథకం ద్వారా విదేశీ వేర్‌హౌసింగ్, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను ఎగుమతిదారులు ఉపయోగించుకోవచ్చు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం వరకు మూడేళ్ల పాటు సాయం చేస్తారు. ఈశాన్య, కొండ ప్రాంతాల ఎగుమతిదారుల కోసం లిఫ్ట్ పథకాన్ని తెచ్చారు.
రవాణా ఖర్చుల్లో 30 శాతం మొత్తాన్ని లేదా ఆర్థిక సంవత్సరానికి రూ. 20 లక్షల వరకు తిరిగి చెల్లిస్తారు. ట్రేడ్ ఇంటెలిజెన్స్ కోసం ఇన్ సైట్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఎఫ్‌టీఏల వల్ల ఎగుమతిదారులకు మార్కెట్ అవకాశాలు పెరిగాయన్నారు.
ప్రపంచ జీడీపీలో 70 శాతం భారత్ కు అందుబాటులో ఉందని తెలిపారు. 2025–-26 ఏప్రిల్ నుంచి జనవరి మధ్య దేశ ఎగుమతులు 2.22 శాతం పెరిగి 366.63 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 7.21 శాతం పెరిగి 649.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్య లోటు 283.23 బిలియన్ డాలర్లు ఉంది.
