నిజాం కాలేజీ విద్యార్థులపై పోలీసుల దాడి సరికాదు : ఎస్ఎఫ్ఐ

నిజాం కాలేజీ విద్యార్థులపై పోలీసుల దాడి సరికాదు : ఎస్ఎఫ్ఐ

హైదరాబాద్: తమకు హాస్టల్ వసతి కల్పించాలని కోరుతూ నిజాం కళాశాలలో ఆందోళన చేపట్టిన కళాశాల విద్యార్ధులపై పోలీసులు చేసిన దాడిని భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కళాశాల క్యాంపస్ లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అమ్మాయిలపై పోలీసులు విచక్షణా రహితంగా  దాడి చేశారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సమస్యల గురించి ప్రశ్నించిన విద్యార్థులపై దాడులు చేయడమా? అని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య యుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్ధుల సమస్యలు పరిష్కరించకుండా అరెస్ట్ చేయించడం సిగ్గుచేటన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్థులను తక్షణమే  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.