రంగారెడ్డి జిల్లా: బెయిల్పై బయటికొచ్చి ఆరు మందిని హత్య చేసిన పోక్సో నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. బాధితులకు సంఘీభావంగా వచ్చిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై బాధితులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురై.. ఒక్క సరిగా ఎమెల్యేపై తిరగబడటంతో ఎమ్మెల్యే కాలే యాదయ్య పరుగులు తీశారు. కొన్ని గంటల నుంచి రోడ్డుపై బైఠాయించి బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులతో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా మాట్లాడారు. నిందితుడు రాజ్ కుమార్ కోసం తొమ్మిది బృందాలతో ప్రత్యేక గాలింపులు చేస్తున్నామని చెప్పారు.
నిందితుడు రాజ్ కుమార్ ఫోన్ అర్ధరాత్రి 12 గంటల సమయంలో స్విచ్ ఆఫ్ చేశాడని, నిందితుడు ప్రయాణిస్తున్న కారును ఉదయం 6 గంటలకు దర్యాప్తు బృందాలు సీసీ కెమెరాలలో గుర్తించాయని తెలిపారు. సీఐ కాంత రెడ్డితో సహా ఎస్సై రమేష్ని వెంటనే సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఎంక్వైరీ చేశాక చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు. డీసీపీ చెప్పిన సమాధానంతో ఏకీభవించని బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనను కొనసాగించారు. పోలీస్ స్టేషన్లో ఫ్యూచర్ సిటీ సీపీతో, ఐదుగురు సభ్యులతో చర్చలకు రావాలని బాధితులను డీసీపీ అడిగారు. రోడ్డుపైనే చర్చలు జరపాలని బాధితులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి కలెక్టర్ రావాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను ఉధృతం చేశారు.
- రంగారెడ్డి జిల్లాలో దారుణం
- షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురి హత్య
- ఆరుగురిని కత్తితో పొడిచి చంపిన రాజ్‌కుమార్
- పోక్సో కేసు పెట్టారన్న కక్షతో హత్య చేసిన నిందితుడు
- భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య
- మే 16న కేసు పెట్టిన బాధితురాలి తల్లి
- బెయిల్‌పై వచ్చి నిందితుడు రాజ్‌కుమార్ ఘాతుకం
- బాధిత బాలికను, ఆమె తల్లిని, నానమ్మను హత్య చేసిన నిందితుడు
- తర్వాత ఇంటికెళ్లి భార్య, ఇద్దరు పిల్లల హత్య
- హత్యల అనంతరం తల్లిదండ్రులకు రాజ్‌కుమార్ ఫోన్
- ఆరుగురిని హత్య చేసినట్టు ఫోన్‌లో చెప్పిన నిందితుడు
- తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన రాజ్‌కుమార్
- రాజ్‌కుమార్ కోసం గాలిస్తున్న పోలీసులు
