- దేశంలో ఏడో ర్యాంక్, రాష్ట్రంలో మొదటి స్థానం
- కేంద్ర హోం శాఖ ప్రకటన
శామీర్ పేట, వెలుగు: దేశవ్యాప్తంగా కేంద్ర హోం శాఖ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్ పేట పోలీస్ స్టేషన్ ఏడో స్థానంలో నిలిచింది. తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూలంగా పరిష్కారం చూపడం వంటి అంశాలను హోం శాఖ పరిగణనలోకి తీసుకుంది. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ సీసీటీఎన్ఎస్ పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలను కూడా పరిశీలించింది.
ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను కేంద్ర హోం శాఖ ఎంపిక చేస్తుంది. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, ఏసీపీ మేడ్చల్ బాలగంగిరెడ్డి, శామీర్ పేట ఇన్ స్పెక్టర్ శ్రీనాథ్‌తో పాటు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
