ఛీ.. మీరేం దోస్తులు..! అమెరికా తీరుపై ఎంపీ శశిథరూర్ ఫైర్

ఛీ.. మీరేం దోస్తులు..! అమెరికా తీరుపై ఎంపీ శశిథరూర్ ఫైర్

న్యూఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో అమెరికా దాడికి గురైన నౌకలోని ముగ్గురు భారతీయ సిబ్బంది మృతి చెందడంపై అమెరికా స్పందించిన తీరును కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా తప్పుబట్టారు. భారత్‎కు వ్యూహాత్మక భాగస్వామి అయినప్పటికీ.. అమాయక భారతీయుల ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేయడానికి నిరాకరించిన అమెరికాను సున్నితత్వం లేని మిత్రుడని అభివర్ణించారు. అమాయక భారతీయుల ప్రాణనష్టంపై ఎలాంటి విచారం, సంతాపం వ్యక్తం చేయని అమెరికా ప్రకటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. 

హార్మూజ్ జలసంధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే నౌకలను ఆపడానికి ప్రాణహాని లేని మార్గాలను ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నించారు. అమాయక సిబ్బందిని చంపే లక్ష్యంతో క్షిపణులను ప్రయోగించకుండా.. నౌకను నిలిపేయడం సాధ్యం కాదా అని ప్రశ్నించారు. గల్ఫ్ జలాల్లో ప్రయాణించే దాదాపు ప్రతి వాణిజ్య నౌకలోనూ భారతీయ సిబ్బంది ఉంటారని.. వాటన్నింటిపై అమెరికా దాడులు చేస్తుందా అని ప్రశ్నించారు. భారత వ్యూహాత్మక భాగస్వామి, మిత్ర దేశమైన అమెరికా వైఖరి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. 

అసలేం జరిగిందంటే..?

ఇరాన్‎తో యుద్ధం నేపథ్యంలో హార్మూజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం విధించిన విషయం తెలిసిందే. యూఎస్ బ్లాకేడ్ నిబంధనలు ఉల్లంఘించిన, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేసిన ఆయా నౌకలపై అమెరికా దాడులతో చేస్తోంది. ఈ క్రమంలోనే 2026, జూన్ 8న 24 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న పలావు జెండా గల మారివెక్స్ అనే చమురు ట్యాంకర్పై అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇదిలా ఉండగానే.. 2026, జూన్ 10న భారతీయ నావికులతో MT సెట్టెబెల్లో అనే మరో నౌకపై అమెరికా దాడి చేసింది.

ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. ఈ ఘటనపై ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశ విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ ఘటనపై అమెరికా ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ మార్కో రూబియోతో శుక్రవారం (జూన్ 12)న ఫోన్‎లో మాట్లాడారు. గల్ఫ్ తీరంలో అమెరికా నౌకాదళం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించడాన్ని ఇండియా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య నౌకలపై ఇటువంటి ప్రాణాంతక చర్యలు సమర్థనీయం కావని రుబియోతో అన్నారు జైశంకర్.

►ALSO READ | అస్సాంలో కూలిన వాయుసేన విమానం ఐదుగురు మృతి

అమెరికా రియాక్షన్ ఏంటంటే..?

హార్మూజ్ జలసంధిలో బ్లాకేడ్ (దిగ్భంధనం) నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా సరే సహించబోమని అమెరికా తేల్చిచెప్పింది. హార్మూజ్ జలసంధిలో శాంతిభద్రతలు కాపాడేందుకు అమెరికా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో అన్ని దేశాలు తమ ఆదేశాలను పాటించాలని కుండబద్దలు కొట్టింది. అమెరికా విధించిన దిగ్భంధనం ఉల్లంఘించిన, ఇరాన్ చమురును అక్రమంగా రవాణా చేసిన ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తేల్చిచెప్పింది. కాగా, హార్మూజ్ జలసంధిలో భారత నావికులతో వెళ్తున్న నౌకలపై యూఎస్ దళాలు దాడులు చేయడంపై ఇండియా అభ్యంతరం తెలపడంపై అమెరికా ఈ విధంగా రియాక్ట్ అయ్యింది.