అస్సాంలో కూలిన వాయుసేన విమానం ఐదుగురు మృతి

అస్సాంలో కూలిన వాయుసేన విమానం ఐదుగురు మృతి
  •     మృతుల్లో ఇద్దరు అధికారులు, ముగ్గురు జవాన్లు 
  •     ఎయిర్​ఫోర్స్ స్టేషన్​లో ల్యాండ్ అవుతుండగా ప్రమాదం 
  •     విమానం రెండు ముక్కలై చెలరేగిన మంటలు.. ప్రాణాలతో బయటపడ్డ కో-పైలట్

జోర్హాట్: అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌‌‌‌లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాయుసేనకు చెందిన ఆంటనోవ్ ఏఎన్-32 రవాణా విమానం ల్యాండ్ అవుతుండగా కూలిపోవడంతో ఇద్దరు అధికారులు సహా ఐదుగురు జవాన్లు మృతిచెందారు. విమానం కూలిపోయి రెండు ముక్కలు కావడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి అత్యవసర బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ఆరుగురు సిబ్బంది ఉండగా, కోపైలట్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన జోర్హాట్‌‌‌‌లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అధికారులు వెల్లడించారు. 

శనివారం ఉదయం 10 గంటలకు సాధారణ విమాన విన్యాసాలు చేస్తుండగా ఈ విమానం ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. ప్రమాదంలో స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్‌‌‌‌వాయు ఖేమారామ్ కుమావత్, అగ్నివీర్‌‌‌‌వాయు డానిష్ ఆలమ్‌‌‌‌ ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను కనుగొనడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (దర్యాప్తు కమిటీ) ఏర్పాటు చేశారు. ఈ విమానం జోర్హాట్ వాయుసేన స్టేషన్ నుంచి చాబువా సైనిక స్థావరానికి వెళ్లాల్సి ఉందని, అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి ల్యాండింగ్ కోసం అనుమతి కోరినట్లు తెలిసింది. 

రన్‌‌‌‌వేపై ల్యాండ్ అయిన వెంటనే విమానం నియంత్రణ కోల్పోయి, రన్‌‌‌‌వే పక్కకు దూసుకెళ్లిందని ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత సమాంతరంగా ఉన్న టాక్సీవే వైపు వేగంగా దూసుకెళ్లిన విమానం రెండు ముక్కలుగా విరిగిపోయిందని, వెంటనే మంటల్లో చిక్కుకుందని వివరించాయి. కాగా, బాధిత కుటుంబాలకు వాయుసేన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఈ శోక సమయంలో వారికి వాయుసేన అండగా నిలుస్తుందని పేర్కొంది. ఈ ప్రమాదం పట్ల రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు ఎయిర్ వారియర్స్ మరణించడం  బాధాకరమని, ఆయన సంతాపం ప్రకటించారు.

ఇప్పటివరకు 18 ప్రమాదాలు.. 

ఆంటనోవ్ ఏఎన్-32 అనేది సోవియెట్ రష్యా అభివృద్ధి చేసిన రెండు ఇంజన్లు గల టర్బోప్రాప్ రవాణా విమానం. ఎలాంటి వాతావరణ పరిస్థితులలోనైనా అత్యంత కఠినమైన భౌగోళిక ప్రాంతాలలోకి సిబ్బందిని తరలించడానికి, కీలకమైన వస్తువులను ఎయిర్ డ్రాప్ చేయడానికి దశాబ్దాలుగా నమ్మకమైన వాహనంగా ఈ విమానాలు ఐఏఎఫ్‌‌‌‌కు సేవలందిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైన కాశ్మీర్‌‌‌‌లోని సియాచిన్‌‌‌‌లో మోహరించిన దళాలకు ఆహారం, అవసరమైన పరికరాలను కూడా ఇవే అందిస్తున్నాయి. ఐఏఎఫ్ ప్రస్తుతం 90 ఏఎన్-32 విమానాలను నడుపుతోంది. దశాబ్దాల నాటి ఈ విమానాల కాల పరిమితిని పెంచడానికి పలుమార్లు ఆధునీకరించారు. 

అయితే, కాలం చెల్లుతున్న ఏఎన్-32 విమానాలతో పాటు ఐఎల్-76 విమానాలను కూడా మార్చాలని ఐఏఎఫ్ ఇప్పుడు యోచిస్తోంది. పాతబడిపోతున్న ఏఎన్-32, ఐఎల్-76 విమానాల స్థానంలో మీడియం ట్రాన్స్‌‌‌‌పోర్ట్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ (ఎమ్‌‌‌‌టీఏ) కొనుగోలు ప్రక్రియ 2022లోనే ప్రారంభమైంది. కాగా, 1980ల చివరి కాలం నుంచి ఇప్పటివరకు ఏఎన్-32 విమానాలు కనీసం18 ప్రమాదాలకు గురయ్యాయి.