తెలంగాణ మలిదశ ఉద్యమంలో కళాకారులు పోషించిన పాత్ర కీలకమని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక కళాకారులు ఎంపీ వంశీకృష్ణను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ.. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు అత్యంత కీలక పాత్ర పోషించారు. వారి గళం, వారు పాడిన పాటలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపాయి. కవులు, కళాకారుల గొంతుకల సాక్షిగా ఏర్పడిన తెలంగాణలో.. గత ప్రభుత్వ హయాంలో కళాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వంలో తెలంగాణ కోసం పోరాడిన అమరుల కుటుంబాలకు, కవులకు, కళాకారులకు పూర్తి స్థాయిలో గుర్తింపు అందించి, న్యాయం చేస్తామని ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు.
