కేరళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా షానిమోల్ ఉస్మాన్ ఎన్నికయ్యారు. కేరళ శాసన సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో ఆమె విజయం సాధించి ఆ పదవిని దక్కించుకున్నారు. గత 35 ఏళ్లలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా షానిమోల్ చరిత్ర సృష్టించారు. అంతకుముందు మే 22న జరిగిన ఎన్నికల్లో స్పీకర్ గా తిరువంచూర్ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు.
మంగళవారం (జూన్ 2) జరిగిన కేరళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి జరిగిన ఎన్నికల్లో షానిమోల్ ఉస్మాన్, ఎల్‌డీఎఫ్ అభ్యర్థి, సీపీఐ ఎమ్మెల్యే మహమ్మద్ ముహ్సిన్‌పై విజయం సాధించారు. 140 మంది సభ్యులున్న కేరళ శాసనసభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)కు 102 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉండటంతో షానిమోల్ ఎన్నిక లాంఛనమైంది. ఓటింగ్‌లో షానిమోల్‌కు 99 ఓట్లు రాగా, ముహ్సిన్‌కు 34 ఓట్లు లభించాయి. షానిమోల్ ఎన్నికతొ కేరళ శాసనసభలో నాలుగు దశాబ్దాల తర్వాత మరో మహిళా డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టినట్లైంది. రాష్ట్ర చరిత్రలో ఈ పదవిని చేపట్టిన నాల్గవ మహిళగా షానిమోల్ నిలిచారు.
