యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి శుక్రవారం దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ ఈవో భవానీ శంకర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం ప్రధానాలయ ముఖ మంటపంలో ఆలయ సిబ్బందికి పండితగోష్టి గావించారు.
స్వామివారిని దర్శించుకున్న రాంచందర్ రావు
యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు దర్శించుకున్నారు. ప్రధానాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు
అందజేశారు.
