లైంగిక వేధింపుల కేసులో స్వామి అవిముక్తేశ్వరానంద్ కు అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్టును నిలిపివేస్తూ అలహాబాద్ హైకోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 27) భారీ ఉపశమనం కల్పించింది. ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు దర్యాప్తు చర్యల నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శంకరాచార్యపై కొనసాగుతున్న చట్టపరమైన చర్యల నుంచి ఉపశమనం కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు.. తక్షణ చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది.
పోక్సో చట్టం కింద తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో తను నిర్దోషినని చెప్తూ వస్తున్న అవిముక్తేశరానంద్.. నిజాన్ని నిరూపించడానికి నార్కో అనాలిటిక్ టెస్ట్ యించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. నిజాన్ని వెలికితీసేందుకు అందుబాటులో ఉన్న ఏ పద్ధతులనైనా అవలంబించవచ్చు అని మీడియాతో అన్నారు.
శుక్రవారం సాయంత్రం 5:15 గంటల ప్రాంతంలో అలహాబాద్ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించింది. తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ సందర్భంగా అవిముక్తేశ్వరానంద్ మాట్లాడుతూ.. తన న్యాయవాదులు అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచుతారని చెప్పారు.
మెడికల్ రిపోర్ట్ మా ప్రమేయాన్ని ఎలా నిర్ధారిస్తుంది? మేము తప్పు చేసినట్లు వచ్చిన రిపోర్టు.. ఎవరో చేసిన ప్రకటన ఆధారంగా చేసింది కావచ్చు. చాలా రోజుల తర్వాత నిర్వహించిన రిపోర్టు కు అర్థం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.
ఎప్పుడూ తమ దగ్గరకు రాని పిల్లల విషయంలో తమ పేరు ఎలా ముడిపెడతారని ఆయన ప్రశ్నించారు. ఆ పిల్లలు పటీషనర్ అశుతోష్ బ్రహ్మచారి అలియాస్ పాండేతో కలిసి నివసిస్తున్నారని, వారిని జువైనల్ హోమ్‌కు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. పిల్లలను హార్డోయ్‌లోని ఒక హోటల్‌లో ఉంచారని మీడియా రిపోర్ట్స్ ను ప్రస్తావించారు. తనను ఇరికించేందుకు ఎన్ని కుట్రలు చేసినా.. చివరికి నిజం బయటకు వస్తుందని అన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిన ప్రయత్నమే ఇది అని ఆయన ఆరోపించారు.
