
హైదరాబాద్, వెలుగు: గణేశ్మండపాల వద్ద షీ టీమ్స్ పోలీసులు నిఘా పెట్టి ఆకతాయిల ఆటకట్టిస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణపతి వద్ద మూడు రోజులుగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని గుర్తించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు 55 మంది ఆకతాయిలను అరెస్ట్ చేశారు. వీడియో ఫుటేజ్ ల ఆధారాలు సేకరించారు.
షీ టీమ్స్‌కి చిక్కిన వారిలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఆటోడ్రైవర్స్ ఉన్నారు. వీరంతా క్యూలైన్‌లో యువతులను టచ్ చేయడం, కామెంట్స్ చేయడం, అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. జార్ఖండ్‌కు చెందిన శ్యామ్ బిహారీ మాతో(28) సెల్‌ఫోన్స్ చోరీ చేస్తుండగా అరెస్ట్ చేశారు. అతని వద్ద 4 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.