
న్యూఢిల్లీ, వెలుగు: మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా తుగ్లక్ రోడ్డులోని తెలంగాణ సీఎం నివాసం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు షేజల్ శుక్రవారం నిరసనకు దిగారు. కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్న సమయంలోనే ఆందోళన చేశారు. ఎమ్మెల్యే నుంచి తనను రక్షించాలని, లైంగిక వేధింపులకు దిగిన ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బ్యానర్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రెస్‌మీట్ తర్వాత సీఎం నివాసంలో ఉన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, ఎంపీలు ఆమెను లోనికి పిలిచి మాట్లాడారు. ఆ సమయంలో సీఎం నివాసంలోనే కేటీఆర్ ఉన్నప్పటికీ షేజల్‌తో మాట్లాడలేదు.
తర్వాత షేజల్ మీడియాతో మాట్లాడుతూ.. తన ఫోన్లు తీసుకొని సీఎం నివాసంలోకి అనుమతించారని తెలిపారు. దుర్గం చిన్నయ్య వ్యవహారంలో తనకు న్యాయం చేస్తామని నేతలు హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేసినందున రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలో నివేదిక సమర్పిస్తామని వినోద్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
మాణిక్ ఠాక్రేను కలిసిన షేజల్
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేను షేజల్ కలిశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు వివరించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉంటుందని ఠాక్రే భరోసా ఇచ్చినట్లు ఆమె చెప్పారు.