తిరుగుబాటు ఎంపీలకు ‘వై’ కేటగిరీ భద్రత

తిరుగుబాటు ఎంపీలకు  ‘వై’ కేటగిరీ భద్రత

ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో షాక్ తగిలింది. శివసేన పార్టీకి ప్రస్తుతం 19మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో 12 మంది ఎంపీలు సీఎం ఏక్‌నాథ్ షిండేతో టచ్‌లో ఉన్నారు. కేబినెట్‌పై బీజేపీ అధినాయకత్వంతో చర్చించేందుకు మంగళవారం (జులై 19న) ఢిల్లీ వెళ్లనున్న ఏక్‌నాథ్ షిండే 12 మంది ఎంపీలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం తిరుగుబాటు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరుతూ లేఖ అందజేయనున్నారని తెలుస్తోంది. 

షిండేకు మద్దతుగా ఉన్న 12 మంది ఎంపీలు గత రాత్రి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అయితే.. దీనిపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ స్పీకర్‌ ప్రత్యేక గ్రూప్‌గా వీరిని గుర్తిస్తే గనుక తిరుగుబాటు ఎంపీలు శివసేన అధికారిక గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇలాంటి టైమ్ లో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక వర్గంగా ఏర్పడిన 12మంది శివసేన ఎంపీలకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.  12 మంది ఎంపీల నివాసాల వద్ద కూడా భద్రత కల్పించినట్లు సమాచారం.