
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని వారి దగ్గర నుండి విడిపోయిన మాలిక్.. 2024లో సనా జావేద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన మాలిక్.. తన భాగస్వామి సనా జావేద్‌కు త్వరలో గుడ్ బై చెప్పబోతున్నట్టు సమాచారం. పాకిస్తాన్ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 2024లో సనాను వివాహం చేసుకున్న మాలిక్ ఆమెతో విడాకులు తీసుకోబోతున్నాడు. ఇద్దరి మధ్య పరిస్థితులు సరిగ్గా లేవని త్వరలోనే వారు విడిపోతున్నట్లు ప్రకటించవచ్చని వార్తలు వస్తున్నాయి.
ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ త్వరలోనే వీరు విడిపోవడం ఖాయమనే పుకార్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలలో మాలిక్ మ్యాచ్ ఆడుతుండగా చాలాసార్లు క్రికెట్ స్టేడియంలో కనిపించి సందడి చేసిన సనా ప్రస్తుతం మాలిక్ తో సంతోషంగా లేదట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ స్పందిస్తున్నారు. చాలా మంది అభిమానులు ఏదో తప్పు జరిగిందని నమ్ముతుండగా.. మరికొందరు ఇది భార్యాభర్తల మధ్య జరిగే సాధారణ గొడవ అని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే మాలిక్, సనా తాము విడిపోతున్నట్టు ఎలాంటి అధికారికా ప్రకటన చేయలేదు.
మొదట అయేషా సిద్దిఖీని రహస్యంగా వివాహమాడిన షోయబ్.. 2010లో ఆమెకు విడాకులిచ్చిన వెంటనే సానియా మీర్జాను పెళ్లాడాడు. వీరిది ప్రేమ వివాహం. ఈ జంటకు ఇజాన్ మీర్జా అనే ఒక కుమారుడు ఉన్నాడు. 14 సంవత్సరాల వివాహ బంధం తర్వాత సానియాకు గుడ్ బై చెప్పి.. పాకిస్తానీ నటి సనా జావేద్ ను మనువాడాడు. 43 ఏళ్ళ మాలిక్ ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024 లో పాకిస్థాన్ జట్టుకు అందుబాటులో ఉంటానని చెప్పినా.. అతన్ని సెలక్ట్ చేయలేదు. మాలిక్ చివరిసారిగా దుబాయ్ వేదికగా జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్ లో ఆడాడు. ఇప్పటివరకు పాకిస్థాన్ తరపున 124 టీ20 మ్యాచ్ ల్లో 2435 పరుగులు చేశాడు. వీటిలో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 287 వన్డేల్లో 7534.. 35 టెస్టుల్లో 1838 పరుగులు చేశాడు.
ఎవరీ సనా జావేద్..?
సనా జావేద్ ఉర్దూ టెలివిజన్‌లో కనిపించే పాకిస్థానీ నటి. ఆమె మార్చి 25, 1993న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జన్మించింది. ఆమె పూర్వీకులది మన హైదరాబాదే. దేశ విభజన సమయం కంటే ముందు జావేద్ పూర్వీకులు కాశ్మీర్ వెళ్లారు. అనంతరం దేశ విభజన సమయంలో కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోయారు. ఆ తదనంతరం ఉద్యోగ, వ్యాపార నిమిత్తం సనా తల్లిదండ్రులు సౌదీ అరేబియాలో స్థిరపడ్డారు.
2012లో షెహర్-ఎ-జాత్‌తో నటిగా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. అనేక రొమాంటిక్ డ్రామాల్లో నటించి మెప్పించింది. ఖానీ చిత్రంలో తన నటనకుగానూ లక్స్ స్టైల్ అవార్డుల నామినేషన్‌ను అందుకుంది. అక్టోబర్ 2020లో సినీ గాయకుడు, గేయ రచయిత ఉమైర్ జస్వాల్‌ను పెళ్లాడిన ఈ భామ.. కొంతకాలానికే అతనితో బంధాన్ని తెంచుకొని ఒంటరిగా జీవించటం ప్రారంభించింది. అంతలోనే మాలిక్ పరిచయమవ్వడం.. అది కాస్తా ప్రేమకు దారితీయటం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే సానియా- షోయబ్ మధ్య విబేధాలు తలెత్తడంతో.. భారత టెన్నిస్ స్టార్ కు గుడ్ బై చెప్పిన పాక్ క్రికెటర్ మరొకరిని తన జీవితంలోకి ఆహ్వానించాడు.
మూడో పెళ్లి తర్వాత మాలిక్ పై విమర్శలు:
షోయబ్ మాలిక్ సనా జావేద్‌తో మూడో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ మాజీ ఆటగాడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సానియా మీర్జాకు విడాకులిచ్చి మూడో పెళ్లి చేసుకోవడంతో ఈ మాజీ పాక్ క్రికెటర్ పై నెటిజన్స్ మండిపడ్డారు. ఇక ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ చేస్తూ షోయబ్ ను నెటిజన్స్ ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. దీనికి తోడు ఇటీవలే ఓ పాక్ మీడియా కథనం మాలిక్ కు పలువురు మోడళ్లు, సెలెబ్రిటీలతో సంబంధాలు కొనసాగిస్తుండగానే సనాతో అతనికి పరిచయం ఏర్పడినట్లు చెప్పుకొచ్చారు.
మాలిక్ పై ప్రస్తుతం సొంత దేశం పాకిస్థాన్ లో సైతం విమర్శల వర్షం కురుస్తుంది. మరోవైపు సానియాకు పాకిస్థాన్ లో మద్దతు లభిస్తుంది. ఇదిలా ఉండగా.. తనపై వస్తున్న ట్రోల్స్, విమర్శలపై మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక ఆన్ లైన్ పోడ్ కాస్ట్ లో మాలిక్ తనపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాడు. మీ మనసు ఏది చెబితే మీరు అదే చేయాలని నేను భావిస్తున్నాను. బయట ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించకూడదు. ప్రజలు ఏమనుకుంటారో అర్థం చేసుకోవడానికి మీకు 10 లేదా 20 సంవత్సరాలు పట్టవచ్చు. అని మాలిక్ అన్నాడు.