నేత కార్మికులను ఆదుకోవాలి

నేత కార్మికులను ఆదుకోవాలి

ముషీరాబాద్ (హైదరాబాద్), వెలుగు:  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా చేనేత వస్త్రాలపై జీఎస్టీని తొలగించి, నేత కార్మికులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎల్. రమణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చేనేతపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్ నారాయణగూడ లో అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో  ఎల్.రమణ మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం చేనేత రంగంపై పన్ను వేయలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న పథకాలను రద్దు చేస్తూ జీఎస్టీ భారం మోపుతోందన్నారు. 

చేనేతపై జీరో జీఎస్టీ కోసం పోరు బాట పడతామని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి అన్నారు. పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత మాట్లాడుతూ.. ఆగస్టు 7న దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని, చేనేతపై జీరో జీఎస్టీ కోసం ఊరూరా తీర్మానాలు చేసి ప్రధాని మోడీకి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని పిలుపునిచ్చారు.