బడిని డెవలప్​ చేసినందుకు..హెచ్ఎం, ఎంఈవోలకు షోకాజ్!

బడిని డెవలప్​ చేసినందుకు..హెచ్ఎం, ఎంఈవోలకు షోకాజ్!

మెదక్, వెలుగు : ఎవరైనా అధికారులు, ఉద్యోగులు తప్పు చేస్తే పై ఆఫీసర్లు వారిమీద యాక్షన్ తీసుకుంటారు. అయితే, మంచి పని చేసినా కూడా ఓ హెడ్​మాస్టర్​, ఎంఈఓలకు..డీఈఓ విచిత్రంగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకు డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో గర్ల్స్ హైస్కూల్ ను దత్తత తీసుకున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ స్కూల్ బిల్డింగ్ అధ్వానంగా ఉండడంతో స్టూడెంట్స్, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్కూల్ ను దత్తత తీసుకుని దాదాపు రూ.40 లక్షలకు పైగా ఖర్చు చేసి బిల్డింగ్ ను రీఇన్నోవేషన్​చేయించడంతో పాటు టాయిలెట్స్ నిర్మించారు. మినరల్ వాటర్ ప్లాంట్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. గ్రీనరీ డెవలప్ చేశారు. దీంతో స్కూల్ రూపు రేఖలు పూర్తిగా మారిపోయి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ ను తలపిస్తోంది. 

పర్మిషన్​ తీసుకోకుండా చేయించారంటూ..

తమ అనుమతి లేకుండా స్వచ్ఛంద సంస్థతో స్కూల్ లో పనులు ఎలా చేయించారంటూ గర్ల్స్ హై స్కూల్ ఇన్​చార్జి హెడ్ మాస్టర్ రేఖతో పాటు, మండల విద్యాధికారి (ఎంఈవో) నీలకంఠంకు డీఈవో రాధాకిషన్​షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే, స్కూల్ రీఇన్నోవేషన్​పనులను ఇంతకు ముందు పనిచేసిన డీఈవో రమేష్ కుమారే కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించడం విశేషం. కాగా, మంచి పని చేయిస్తే అభినందించాల్సింది  పోయి షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఇతరులకు పేరొస్తుందనే...

రానున్న ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన కొడుకు చైర్మన్​గా ఉన్న ఎంఎస్ ఎస్ వో ఆధ్వర్యంలో నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా జరగనిస్తే స్థానిక బీఆర్ఎస్ నేతకు పేరు రాదనే ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి హెచ్ ఎం, ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు ఇప్పించారనే ప్రచారం జరుగుతోంది. 

కలెక్టర్ ​ఆదేశాల మేరకే...

ఈ విషయమై డీఈవో రాధాకిషన్​ను వివరణ కోరగా ప్రభుత్వ స్కూల్ లో స్వచ్ఛంద సంస్థలు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటే ముందస్తుగా పర్మిషన్  తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలా చేయనందునే కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్ ఎం కు, ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు.