158 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ

158 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ
  • మత్తునిచ్చే మందుల అమ్మకాలపై టీజీ సేఫ్ దాడులు
  • రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్సుల రద్దు తప్పదని వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా మత్తునిచ్చే మెడిసిన్స్ విక్రయిస్తున్న మెడికల్ షాపులపై తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (టీజీసేఫ్) డ్రగ్స్ వింగ్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్న ట్రామడాల్, ప్రిగాబాలిన్, నైట్రాజెపామ్, అల్ప్రాజోలం, టాపెంటాడాల్, కొడైన్ కలిగిన సిరప్ లు, జోల్పిడెమ్ వంటి హ్యాబిట్ ఫామింగ్ డ్రగ్స్ అమ్మకాలను అడ్డుకోవడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో మొత్తం 158 మెడికల్ షాపుల్లో రూల్స్ బ్రేక్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ షాపుల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం..  వారి డ్రగ్ లైసెన్సులను టెంపరరీగా సస్పెండ్ చేయడం, లేదా పర్మినెంట్ గా రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కమిషనర్ స్పష్టం చేశారు.

రూల్స్ బ్రేక్ చేస్తూ అమ్మకాలు..  

షెడ్యూల్ హెచ్1, షెడ్యూల్ ఎక్స్ కిందకు వచ్చే మత్తు మందులను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నట్లు, అమ్మిన వాటికి బిల్లులు ఇవ్వకపోవడం, సేల్స్, కొనుగోలు బిల్లులను సరిగ్గా నిర్వహించకపోవడం వంటి అక్రమాలను అధికారులు గుర్తించారు. వీటితో పాటు షెడ్యూల్ హెచ్1 డ్రగ్ రిజిస్టర్లను మెయింటైన్ చేయకపోవడం, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ లేకుండానే మందులు పంపిణీ చేయడం, రికార్డులను చూపించకపోవడం వంటి అక్రమాలపై అధికారులు సీరియస్ అయ్యారు. ప్రిస్క్రిప్షన్ మందులను ఇతర అవసరాలకు మళ్లించడం నేరమన్నారు.