
ఓ హాలీవుడ్ సినిమాలోని ముద్దు సీన్‌ను తొలగించిన సెన్సార్ బోర్డు తీరుపై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి సీరియస్ అయింది. ఇలాంటి చర్యల వల్ల ప్రేక్షకుల థియేటర్స్ కు దూరం అవుతున్నారని, సెన్సార్ బోర్డు ప్రేక్షకులను చిన్నపిల్లల్లా భావించి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్‌ను ఆస్వాదించకుండా చేస్తోందంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. డేవిడ్ కొరెన్స్‌వెట్, రెచెల్ లీడ్ రోల్స్‌లో నటించిన హాలీవుడ్ మూవీ ‘సూపర్ మ్యాన్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ ఇండియన్ వెర్షన్‌లో 33 సెకన్ల ముద్దు సీన్‌తో పాటు హీరోకి సంబంధించిన కొన్ని డైలాగ్స్‌ను సెన్సార్ అభ్యంతరంతో తొలగించారు.
దీనిపై శ్రేయా ధన్వంతరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రేక్షకులేమీ చిన్నపిల్లలు కాదని, వాళ్లు ఏం చూడాలో కూడా సెన్సార్ బోర్డే చెప్పేస్తుందా అని ఆమె ప్రశ్నించింది. ఓ వైపు పైరసీ, మరోవైపు లీకులు అంటూ సినిమాలపై చాలా దాడులు జరుగుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడమే తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కత్తిరింపులు ఎక్కువైతే జనం థియేటర్స్‌కు ఎలా వస్తారంటూ ఆమె సెన్సార్ బోర్డు తీరును తప్పుపట్టింది. ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్, చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్, స్కామ్ 1992 లాంటి వెబ్ సిరీస్‌లతో ఆమె గుర్తింపును అందుకుంది.