Asia Cup 2025: ఇంగ్లాండ్ సిరీస్ హీరోలకు బిగ్ షాక్.. ఆసియా కప్ జట్టులో నో ఛాన్స్

Asia Cup 2025: ఇంగ్లాండ్ సిరీస్ హీరోలకు బిగ్ షాక్.. ఆసియా కప్ జట్టులో నో ఛాన్స్

దుబాయ్, అబుదాబి వేదికగా జరగనున్న ఆసియా కప్ కు టీమిండియా స్క్వాడ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ కాంటినెంటల్ టోర్నీ జరుగుతుంది. ఈ మెగా టోర్నీకి ఆదివారం (ఆగస్టు 17) పాకిస్థాన్ స్క్వాడ్ ను ప్రకటించారు. మంగళవారం (ఆగస్టు 19) భారత జట్టును ప్రకటించనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. రేపే స్క్వాడ్ అనౌన్స్ మెంట్ ఉండడంతో ఇద్దరు స్టార్ క్రికెటర్లకు ఆసియా కప్ లో చోటు దక్కడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ లో టాప్ రన్ స్కోరర్ శుభమాన్ గిల్ తో పాటు టాప్ వికెట్ టేకర్ సిరాజ్ కు ఆసియా కప్ లో అవకాశం లేనట్టు తెలుస్తోంది. 

శుభమాన్ గిల్: 
   
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ టీ20 ఆసియా కప్ కు ఎంపికయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. భారత్ తరపున గిల్ టీ20 ఆడి చాలా కాలమైంది. వన్డే, టెస్ట్ క్రికెట్ తో బిజీగా కనిపిస్తున్న గిల్.. టీ20 ఫార్మాట్ కు దూరమవుతున్నాడు. ఓపెనర్ గా సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఎలాగో సూపర్ ఫామ్ లో ఉన్నారు. బ్యాకప్ ఓపెనర్ గా జైశ్వాల్ సెలక్ట్ కానున్నాడు. గిల్ ఐపీఎల్ 2025 సీజన్ లో అత్యుత్తమంగా రాణించినా ప్రస్తుతం ఉన్న టీ20 జట్టులో గిల్ ను కష్టంగా ఇరికించలేని పరిస్థితి. అంతేకాదు దులీప్ ట్రోఫీలో గిల్ నార్త్ జోన్ కు కెప్టెన్ గా వ్యవహరించడంతో ఆసియా కప్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మహమ్మద్ సిరాజ్: 

హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ కు అందుబాటులో ఉండనున్నాడు. బుమ్రాతో పాటు టీ20 స్పెషలిస్ట్ అర్షదీప్ సింగ్ జట్టులో ఉండడం ఖాయం. వీరికి బ్యాకప్ గా ఐపీఎల్ 2025 సీజన్ పర్పుల్ క్యాప్ వీరుడు ప్రసిద్ కృష్ణ, యంగ్ పేసర్ హర్షిత్ రానా స్క్వాడ్ లో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్ లో సిరాజ్ అద్భుతంగా రాణించి టాప్ వికెట్ టేకర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కించుకోలేకపోయిన సిరాజ్ కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు.