
నాగ్‌పూర్: కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగే.. వన్డేల్లో తమ బలంగా మారుతుందని వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. కోహ్లీ కూడా జోరందుకుంటే ఇండియాను ఆపడం కష్టమన్నాడు. ‘గత ఏడాదిన్నరగా రోహిత్ బాయ్ బ్యాటింగ్ చేస్తున్న విధానం మా ఆటను మార్చేస్తోంది. ఇది ఓ గేమ్ ఛేంజర్‌గా ఉంటుంది. ప్రారంభం నుంచే ఊపు తీసుకొచ్చి ఆటను ఓ స్థాయికి తీసుకెళ్తాడు. దీనివల్ల నాన్ స్ట్రయిక్‌లో ఉన్న బ్యాటర్ల పని సులువు అవుతుంది. ఇది జట్టుకు చాలా ఉపయోగపడుతుంది’ అని గిల్ పేర్కొన్నాడు. జట్టులో మార్పులు చేర్పుల వల్ల ప్లేయర్లలో కొంత అభద్రతాభావం ఏర్పడుతుందన్నాడు.
దీనివల్ల మానసికంగా ఇబ్బందిపడతారని చెప్పాడు. ‘కరుణ్ నాయర్ డొమెస్టిక్‌లో బాగా ఆడి ఉండొచ్చు. కానీ ఆ ఒక్క పెర్ఫామెన్స్‌ను పరిగణనలోకి తీసుకుని ప్లేస్ ఇవ్వలేం. జట్టులో ఉన్న ప్లేయర్లు అలాంటి ఎన్నో పెర్ఫామెన్స్‌ల తర్వాతే ఇక్కడికి వచ్చారు. కాబట్టి ప్లేయర్లను తీసేయడం, చేర్చడం వల్ల వాతావరణం దెబ్బతింటుంది. ఇది జట్టు సమతుల్యతను దెబ్బతీస్తోంది. వరల్డ్ కప్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయాం. కానీ ప్లేయర్లందరూ చాలా శ్రమించారు. దాన్ని సాకుగా తీసుకుని ప్లేయర్లను తప్పించడం వల్ల కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతుంది.
అది అలాగే కొనసాగితే బలమైన జట్టును తయారు చేయలేం. అందుకే కంటిన్యూటీ అనేది ఉండాలి’ అని వైస్ కెప్టెన్ వ్యాఖ్యానించాడు. ఇక యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, తన మధ్య టాప్ ఆర్డర్ ప్లేస్ కోసం ఎలాంటి పోటీ లేదన్నాడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి మ్యాచ్‌లో రాణించాల్సిందేనన్నాడు. తానే ఆడాలి.. ఇతరులు ఆడొద్దనే భావన సరైంది కాదన్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో ఇంగ్లండ్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని గిల్ స్పష్టం చేశాడు.