IND vs SA: ఫోర్ కొట్టి గ్రౌండ్ వదిలి వెళ్లిన గిల్.. పంత్ రాకతో గ్రౌండ్ మొత్తం అరుపులు

IND vs SA: ఫోర్ కొట్టి గ్రౌండ్ వదిలి వెళ్లిన గిల్.. పంత్ రాకతో గ్రౌండ్ మొత్తం అరుపులు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ గాయపడ్డాడు. శనివారం (నవంబర్ 15) ప్రారంభమైన రెండో రోజు ఆటలో భాగంగా గిల్ కు గాయమైంది. వాషింగ్ టన్ సుందర్ కు ఔటైన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన గిల్.. మూడో బంతికే ఫోర్ కొట్టి పరుగుల ఖాతా తెలిచాడు. బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా స్వీప్ షాట్ ఆడడంతో గిల్ మెడ నొప్పితో ఇబ్బందిగా కనిపించాడు. రాహుల్ తో కాసేపు చర్చించిన ఈ టీమిండియా కెప్టెన్ గ్రౌండ్ వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరాగాల్సి వచ్చింది. 

గిల్ రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరడంతో అతని స్థానంలో పంత్ బ్యాటింగ్ కు వచ్చాడు. పంత్ గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్నప్పుడు స్టేడియంలో ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తించారు. చప్పట్లు కొడుతూ బ్యాటింగ్ కు ఆహ్వానించారు. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ ఆడుతూ గాయపడిన ఈ టీమిండియా వికెట్ కీపర్.. ఈ క్రమంలో ఇంగ్లాండ్ తో ఐదో టెస్టుతో పాటు ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని పంత్ ఆడుతున్న తొలి టెస్ట్ సిరీస్ ఇదే కావడంతో ఫ్యాన్స్ ఆనందంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. వికెట్ నష్టానికి 37 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా లంచ్ కు ముందు 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజ్ లో రిషబ్ పంత్ (22), జడేజా (6) ఉన్నారు. వాషింగ్ టన్ సుందర్, కేఎల్ రాహుల్ రెండో వికెట్ కు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పినా భారీ స్కోర్ చేయలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, మహరాజ్, హార్మర్ తలో వికెట్ పడగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 159 పరుగులకు ఆలౌట్ అయింది.