పెండ్లి పేరుతో మోసం చేసిన ఎస్ఐ అరెస్ట్

పెండ్లి పేరుతో మోసం చేసిన ఎస్ఐ అరెస్ట్
  • మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో సర్వీస్ నుంచి సస్పెన్షన్ 

కూకట్​పల్లి, వెలుగు: ప్రేమ, పెండ్లి పేరుతో తోటి మహిళా కానిస్టేబుల్‌‌‌‌ను నమ్మించి వంచించిన ఎస్ఐ సురేశ్ కుమార్‌‌‌‌పై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కొల్లూరు పోలీస్ స్టేషన్‌‌‌‌లో పనిచేస్తున్న సురేశ్ కుమార్, 2020--–23 మధ్య కూకట్‌‌‌‌పల్లి పీఎస్‌‌‌‌లో ఎస్ఐగా పనిచేశారు.

ఆ సమయంలో అక్కడ రైటర్‌‌‌‌గా ఉన్న మహిళా కానిస్టేబుల్‌‌‌‌తో ప్రేమ వ్యవహారం నడిపారు. తనకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారనే నిజాన్ని దాచిపెట్టి, పెండ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించారు. ఈ క్రమంలో ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడమే కాకుండా, పలుమార్లు గర్భం దాల్చగా అబార్షన్లు చేయించారు. మూడు సంవత్సరాల క్రితం కూకట్‌‌‌‌పల్లి నుంచి బదిలీ అయిన తర్వాత సురేశ్ కుమార్ బాధితురాలిని దూరం పెట్టడం ప్రారంభించాడు. పెండ్లి చేసుకోవాలని ఆమె నిలదీయడంతో, తనకు అప్పటికే పెళ్లయిందని చెప్పి నిరాకరించాడు. దీంతో బాధితురాలు ఏప్రిల్ 1న కూకట్‌‌‌‌పల్లి పీఎస్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన అధికారులు సురేశ్ కుమార్‌‌‌‌ను సస్పెండ్ చేశారు. విచారణకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్న సురేశ్‌‌‌‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.