ధృఢ సంకల్పానికి కేపిటల్ సియాచిన్

ధృఢ సంకల్పానికి కేపిటల్ సియాచిన్
  •     బ్యాటిల్​ఫీల్డ్​లో పర్యటన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్
  •     ఆపరేషన్ మేఘదూత్​లో అమరులైన వీరులకు నివాళి
  •     ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో కలిసి భద్రతా పరిస్థితులపై సమీక్ష

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి లడఖ్​లోని సియాచిన్​లో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సోమవారం పర్యటించారు. ఆర్మీ చీఫ్​ జనరల్ మనోజ్ పాండే తో కలిసి ఆ ప్రాంతంలోని భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఆపరేషన్ మేఘదూత్ విజయవంతమై 40 ఏండ్లు ఇటీవలే పూర్తయిన సందర్భంగా యుద్ధ స్మారకం వద్ద అమర వీరులకు ఆయన నివాళి అర్పించారు. 

అనంతరం సైనికులతో మాట్లాడారు. దేశానికి ఢిల్లీ జాతీయ రాజధాని అయితే, ముంబై ఆర్థిక రాజధాని అని, అలాగే టెక్నాలజీకి బెంగళూరు.. ధైర్యసాహసాలు, ధృఢ సంకల్పానికి సియాచిన్ రాజధాని అని రాజ్​నాథ్ అన్నారు. దట్టమైన మంచు పడే ఈ ప్రాంతంలో దేశ రక్షణ కోసం ధైర్యసాహసాలతో పనిచేస్తున్నారని సోల్జర్లను ఆయన మెచ్చుకున్నారు. సియాచిన్ సాధారణ భూమి కాదని, దేశ సార్వభౌమత్వానికి, సంకల్పానికి ప్రతీక అని అభివర్ణించారు. 

1984 ఏప్రిల్ 13న సియాచిన్‌‌లో భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ దేశ సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయమని రాజ్​నాథ్ అన్నారు. ఆపరేషన్ మేఘదూత్ సక్సెస్​ కావడం మనందరికీ గర్వకారణమన్నారు. వీర సైనికుల త్యాగాల వల్లే దేశంలోని ప్రతి పౌరుడి సేఫ్​గా ఉన్నాడని చెప్పారు. సియాచిన్​లో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుడికి ఆయన అభినందనలు తెలిపారు.