రాష్ట్రంలోనే ఉంటా.. నేషనల్ పాలిటిక్స్‎పై ఇంట్రెస్ట్ లేదు: హైకమాండ్ ఆఫర్ తిరస్కరించిన సీఎం సిద్ధరామయ్య

రాష్ట్రంలోనే ఉంటా.. నేషనల్ పాలిటిక్స్‎పై ఇంట్రెస్ట్ లేదు: హైకమాండ్ ఆఫర్ తిరస్కరించిన సీఎం సిద్ధరామయ్య

బెంగళూర్: ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగడం, జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం (మే 28) కర్నాటక సీఎం పదవికి  సిద్ధరామయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవికి రాజీనామా చేయడంతో తన రాజకీయ ప్రస్థానం ఇంకా ముగియలేదన్నారు. 

తాను రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉంటానని స్పష్టం చేశారు. అయితే, నేషనల్ పాలిటిక్స్‎పై తనకు మాత్రం ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. తనకు హైకమాండ్ రాజ్య సభ సీటు ఆఫర్ చేసిందని.. కానీ ఆ ప్రతిపాదననను తాను తిరస్కరించానని తెలిపారు. తద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకుండా కర్ణాటక రాజకీయాల్లోనే పాతుకుపోవాలనే తన ఉద్దేశాన్ని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకే తాను రాజీనామా చేశానని సిద్దరామయ్య స్పష్టం చేశారు. హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహిస్తానని తెలిపారు. గవర్నర్ బెంగళూరులో లేకపోవడంతో తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయంలో సమర్పించినట్లు తెలిపారు. చట్ట ప్రకారం గవర్నర్ నా రాజీనామాను ఆమోదించాలి. ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత గవర్నర్ దానిని ఆమోదించి కొత్త ముఖ్యమంత్రికి మార్గం సుగమం చేయాలి. అది ఆయన బాధ్యత అని అన్నారు.