ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్య

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్య

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ర్ట 24వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య శనివారం (మే 20వ తేదీ) ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లాట్‌ సిద్ధరామయ్య చేత ప్రమాణస్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్, జార్ఘండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ , సీపీఐ నేత డీ. రాజా, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ,  సినీ నటులు, మక్కల్ నీది మయం అధ్యక్షులు కమల్ హాసన్ హాజరయ్యారు. 


ప్రమాణస్వీకారం చేసిన 8 మంది మంత్రులు వీళ్లే

1. ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ)

2. మునియప్ప (ఎస్సీ)

3. పరమేశ్వర (ఎస్సీ)

4. రామలింగారెడ్డి (రెడ్డి)

5. ఎంబీ పాటిల్ (లింగాయత్)

6. కేజే జార్జ్ (క్రిస్టియన్)

7. జమీర్ అహ్మద్ (మైనార్టీ)

8. సతీష్ జార్కొలి (ఎస్టీ)

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఉన్నారు. చాలామంది గతంలో మంత్రులుగా పని చేసిన వారే ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ.. మంత్రివర్గంలో చోటు కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. కేబినెట్ లో సిద్ధరామయ్య వర్గం నుంచి ఆరుగురికి చోటు కల్పించారు. డీకే శివకుమార్ వర్గం నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కింది. మరొకరు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు అవకాశం కల్పించారు. 

సైడ్ లైట్స్ 

* కేబినెట్ లో దళిత సామాజిక వర్గం నుంచి ముగ్గురికి అవకాశం
* వేదికపై అందరూ సిద్ధరామయ్యకు అభివాదం తెలిపారు. 
* తమ తండ్రి ప్రమాణస్వీకారం సందర్భంగా వేదికపై సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సందడి చేస్తూ కనిపించారు.
* ప్రమాణస్వీకారానికి చేసే ముందు డీకే అందరికీ అభివాదం చేశారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ మిత్రపక్షాల వద్దకు వెళ్లి నమస్కారం చేశారు. ఈ సందర్భంగా వారంతా డీకేకు శుభాకాంక్షలు తెలిపారు. 
* ప్రమాణస్వీకారానికి ముందు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్‌, ప్రియాంక గాంధీకి శివకుమార్‌ స్వయంగా సాదర స్వాగతం పలికారు. దగ్గరుండి వారిని వేదిక వద్దకు తీసుకొచ్చారు.


కర్ణాటకలో మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. 13న ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 224 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించింది.