కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. డీకే డిప్యూటీ సీఎం

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. డీకే డిప్యూటీ సీఎం

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను డిసైడ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎం రేసులో ఉన్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు.. కీలక శాఖల బాధ్యతలను అప్పగిస్తూ సోనియా, రాహుల్ గాంధీ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నుంచి మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ సాయంత్రం.. అంటే మే 18 వ తేదీ  అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడు రోజులుగా సాగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. సీఎం పదవి కోసం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. అయితే సిద్ధరామయ్యకు ఉన్న అనుభవం, సీనియార్టీని పరిగణలోకి తీసుకుని.. డీకే శివకుమార్ ను బుజ్జగించినట్లు తెలుస్తుంది.

డీకే శివకుమార్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉన్నా.. సిద్ధరామయ్యకే మొగ్గు చూపింది. రాబోయే జనరల్ ఎలక్షన్స్ వరకు కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గానే కొనసాగాలని.. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత సీఎం పదవి ఇస్తామంటూ కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం.

ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మే 20 వ తేదీన బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేస్తారా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సిద్ధరామయ్యతోపాటు డీకే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్టానం నుంచి ఓ క్లారిటీ రావటంతో.. కర్ణాటకలో రాజకీయ టెన్షన్ కు తెరపడింది. అయితే డీకే వర్గీయులు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.