20న కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సిద్ధరామయ్య 

20న కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సిద్ధరామయ్య 

కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మే 20వ తేదీ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరితో పాటు8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు. మరోవైపు.. ఏడుగురు ముఖ్యమంత్రులు, ముగ్గురు విపక్ష నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు బెంగళూరుకు చేరుకున్నారు. 

కేబినెట్​లో ఎవరికి అవకాశం కల్పించాలన్న అంశంపై పార్టీ హైకమాండ్ పెద్దలతో మే 19వ తేదీన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ జరిపారు. ఎవరికి ఏ శాఖ ఇస్తే బాగుంటుందన్న దానిపై కూడా మాట్లాడుకున్నారు. శనివారం (మే 20న) నిర్వహించనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా పార్టీ పెద్దలను సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కోరారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్​గాంధీ, ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీల అమలుకు కేబినెట్ ఫస్ట్ మీటింగ్​లోనే ఆమోదం తెలుపుతామన్నారు డీకే శివకుమార్. 

34 మందితో కేబినెట్ ఏర్పాటు చేస్తున్నామని డీకే వివరించారు. నేషనల్ లీడర్స్ అందరూ ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తున్నారని, ఫస్ట్​ కేబినెట్​లో ఐదు గ్యారెంటీ స్కీమ్ అమలుకు నిర్ణయం తీసుకుంటామని వివరించారు. బీజేపీ, జేడీఎస్ లీడర్లను ఇన్వైట్ చేశామని, వారు కూడా ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నవారే అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతిపక్ష పార్టీల సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు.