హైదరాబాద్, వెలుగు: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో ప్రధాన నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి సోమవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. 2004లో హైదరాబాద్ ఫస్ట్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు వెల్లడించిన తీర్పు మేరకు ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు గతంలో ఐదేండ్ల కఠిన కారాగార శిక్ష విధించగా.. సిద్ధార్థ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు.
విచారణ అనంతరం 2011లో హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఐదేండ్ల శిక్షను రెండేండ్లకు తగ్గిస్తూ తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుపై సిద్ధార్థ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో 24 ఏండ్ల తర్వాత మళ్లీ ఈ కేసు చర్చనీయాంశం అయ్యింది.
కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని..
భువనగిరికి చెందిన నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్న సమయంలో చికిత్స పొందుతూ ప్రత్యూష హాస్పిటల్‌లో ప్రాణాలు కోల్పోయింది.
సిద్ధార్థ్ రెడ్డి మాత్రం చికిత్స అనంతరం కోలుకున్నాడు.ఈ ఘటనపై ప్రత్యూష తల్లి సుధీర్ఘ న్యాయపోరాటం చేసింది. ప్రత్యూషది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని నాంపల్లి కోర్టు, హైకోర్టు సహా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాడని పేర్కొంటూ 2004లో సిద్ధార్థ్‌రెడ్డిని నాంపల్లి కోర్టు దోషిగా నిర్ధారించింది. ఐదేండ్ల జైలు శిక్ష విధించింది.
నాంపల్లి కోర్టు తీర్పుపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. దాంతో ఐదేండ్ల జైలు శిక్షను రెండేండ్లకు తగ్గిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ తీర్పును కూడా సవాల్ చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ప్రత్యూష తల్లి కూడా సిద్ధార్థ్‌రెడ్డికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించింది.
చివరకు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సిద్ధార్థ్‌రెడ్డి వేసిన అప్పీల్ పిటిషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 17న కొట్టివేసింది. 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్‌రెడ్డి.. సోమవారం నాంపల్లి కోర్టుకు వచ్చి లొంగిపోయాడు.
