బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తున్నరు : ఎమ్మెల్యే హరీశ్​ రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తున్నరు : ఎమ్మెల్యే హరీశ్​ రావు
  •     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈడీ, ఐటీలతో వేధిస్తున్నాయి
  •     మాజీ మంత్రి హరీశ్​ రావు

రామచంద్రాపురం, వెలుగు : కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకోవాలని చూస్తున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావు ఆరోపించారు. పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్​రెడ్డి ఇండ్లపై గురువారం ఈడీ దాడులు చేయగా..శుక్రవారం వారిని హరీశ్​రావు పరామర్శించారు. హరీశ్​రావు మాట్లాడుతూ ఈడీ, ఐటీ వ్యవస్థలను ఉపయోగించుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలను వేధిస్తున్నాయని ఆరోపించారు. 

బిహార్, గుజరాత్​లో నీట్ ప్రశ్నపత్రాలను అమ్ముకొని లక్షల మంది స్టూడెంట్స్​భవిష్యత్​ను అయోమయంలో పడేసిన వారిపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిళ్లకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఏ తప్పు చేయలేదని, ఈడీకి ఎలాంటి అక్రమ ఆస్తులు దొరకలేదన్నారు. ఇబ్బందులకు గురవుతున్న ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

 న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్​, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి, వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు.