యాసంగిలో వరి వైపే మొగ్గు.. సిద్దిపేట జిల్లాలో 3.63 లక్షల ఎకరాల్లో సాగు

యాసంగిలో వరి వైపే మొగ్గు.. సిద్దిపేట జిల్లాలో  3.63 లక్షల ఎకరాల్లో సాగు
  • 4.12 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు 

సిద్దిపేట, వెలుగు: జిల్లాలో యాసంగిలో వరి సాగు వైపే అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత యాసంగి  సీజన్​లో దాదాపు 4.12లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు జరుగుతుందని అంచనా వేస్తుండగా దాదాపు 3.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 70 శాతానికి పైగా వరి సాగు జరగనుందని అంచనా వేస్తుననారు.  గత సీజన్​లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూగర్భ జల మట్టాలు పెరగడంతో రైతన్నలు వరి సాగు వైపే మొగ్గుచూపుతున్నారు. తర్వాత మొక్కజొన్న, స్వీట్ కార్న్, శెనగ, వేరుశెనగ  సన్ ఫ్లవర్ తో పాటు నూనె గింజల సాగుకు రైతులు  ప్రాధాన్యత  ఇస్తున్నారు.  

జిల్లాలో 3.63 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉండగా ఇందులో 20 శాతం సన్న రకాలు సాగు చేయనున్నారు. నీటి లభ్యత ఆశాజనకంగా ఉండడంతో జనవరి మొదటి వారం నుంచి వరి నాట్లు ప్రారంభమయ్యాయి.  యాసంగి సీజన్​లో  వివిధ రకాల పంటలకు అవసరమైన ఎరువులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో యూరియా, డీఏపీ, ఎంవోపీ, ఎంపీకే  ఎరువులను అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి తెస్తున్నారు.  

రైతుల అవసరాలను గుర్తించి అవసరమైన బఫర్ స్టాక్​ను సిద్ధం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వరి నాట్లు మొదలవడంతో యూరియా కోసం రైతులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టారు. అధికారులు రైతు బంధు లబ్దిదారుల జాబితాల ప్రకారం టోకెన్లు జారీ చేస్తూ యూరియా అందేలా ప్రణాళక రూపొందించారు.

పంట మార్పిడిపై అవగాహన కరువు 

పంట మార్పిడి చేయకపోవడం వల్ల భూసారంతో పాటు దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి. జిల్లాలో వాతావరణం, నేలల స్వభావం, నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని యాసంగి కాలానికి అనువైన సన్న వరి రకాలను రైతులు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. 

సన్న వరి రకాల సాగుపై సూచనలు

యాసంగి సీజన్​లో సన్నాల సాగుపై అధికారులు రైతులకు పలు సూచనలు అందిస్తున్నారు. జిల్లాలో వరి ప్రధాన పంటగా సాగవుతున్నందున  రైతులు మంచి దిగుబడితో పాటు బోనస్ ను పొందడానికి సన్నాలు సాగు చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణ సోన (ఆర్ఎన్ఆర్-15048), (కేఎన్ఎమ్-1638 కూనారం వరి-2), అంజన (జేజీఎల్-11118), జగిత్యాల సన్నాలు (జీజీఎల్-1798)  ప్రత్యుమ్న (జేజీఎల్ -17004) రకాలు సాగు చేస్తే   అధిక దిగుబడితో పాటు మిల్లర్ల నుంచి డిమాండ్ ఉంటుందని సూచిస్తున్నారు. వీటికి తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం ఉండడంతో పాటు, చలిని, నీటి కొరతను కూడా తట్టుకుని అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

జిల్లాలో యాసంగి సాగు అంచనాలు (ఎకరాల్లో )

వరి    3.63 లక్షల ఎకరాలు 

మొక్కజొన్న    31.416 ఎకరాలు

స్వీట్ కార్న్    1000  ఎకరాలు

సన్ ఫ్లవర్    12 000 ఎకరాలు

శెనగ    600 ఎకరాలు

వేరుశెనగ    500 ఎకరాలు

ఇతర పంటలు    90 వేల ఎకరాలు 

అధికారుల సూచనలు పాటించాలి 

యాసంగి సీజన్​లో వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి రైతులు పంటలను సాగు చేయాలి. లేత నారును నాటడం, ఎరువుల వినియోగం, తెగుళ్లపై ముందస్తుగా దృష్టిపెడితే మంచి దిగుబడులు వస్తాయి. యాసంగి సీజన్ లో రైతులకు అన్ని విషయాల్లో అవగాహన కల్పిస్తాం. అన్ని రకాల పంటలకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాం.–స్వరూప రాణి, జిల్లా వ్యవసాయ అధికారి