
- అళంద్లో ఓట్ల తొలగింపుపై రాహుల్ ఆరోపణలు
బెంగళూరు: కర్నాటకలోని కలబురగి జిల్లా అళంద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓట్ల తొలగింపుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఓట్ల చోరీకి పాల్పడిన వారిని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కాపాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో సిద్దరామయ్య సర్కారు సిట్ ను ఏర్పాటు చేసింది. కాగా.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అళంద్ సెగ్మెంట్లో ఓట్లను ఎలా తొలగించారో, ఎలా కలిపారో వివరిస్తూ రాహుల్ ఇటీవలే ప్రజంటేషన్ ఇచ్చారు.
ఒక వర్గం వారు సెంట్రలైజ్డ్ మెథడ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి ఓటర్లను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఆ సాఫ్ట్ వేర్తో ఓటర్ల లిస్టు నుంచి రియల్ ఓటర్ల పేర్లను తొలగించారని చెప్పారు. అళంద్లో జరిగిన ఓట్ చోరీపై కర్నాటక క్రైం ఇన్విస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ) చేస్తున్న దర్యాప్తుకు ఎన్నికల సంఘం సహకరించడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. గత రెండేండ్లుగా ఈ అంశంపై దర్యాప్తును నిలిపివేశారని ఆయన చెప్పారు. సీఐడీ పంపిన ఉత్తరాలకు ఈసీ జవాబు ఇవ్వడంలేదని మండిపడ్డారు.